మహారాణిపేట: వివాహాలు, శుభకార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. భాద్రపద మాసం శూన్య మాసంగా పరిగణించడంతో అక్టోబర్ 10 వరకు 34 రోజుల పాటు శుభ ముహూర్తాలు ఉండవు. అక్టోబర్ 11 నుంచి తిరిగి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. శ్రావణం, నిజ జ్యేష్ఠ మాసాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగడంతో ఇటీవల వరకు కల్యాణ మండపాలు, పుణ్యక్షేత్రాలు పెళ్లి సందడితో కళకళలాడాయి. వేద మంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.
అక్టోబర్ 11 నుంచి మళ్లీ సందడి
అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ చివరి వరకు పలు శుభ ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 11, 14, 29, 30 తేదీలతో పాటు నవంబర్‌లో 5, 11 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు, డిసెంబర్‌లో 2, 3, 4, 10 నుంచి 13 వరకు, 15 నుంచి 19 వరకు, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఈ విరామ సమయంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతాలు, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించవచ్చని పండితులు చెబుతున్నారు.
భాద్రపదంలో
శుభకార్యాలకు విరామం
భాద్రపద మాసంలో వినాయక చవితి, మహాలయ పక్షం వంటి పర్వదినాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో దేవతారాధన, పితృకార్యాలకు ప్రాముఖ్యత ఇస్తారు. సంప్రదాయ ముహూర్త శాస్త్రం ప్రకారం వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. అశ్వయుజ మాసం నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
– గంగవరపు పార్వతీశ్వర శర్మ,
శైవగామ పండితులు, సీతంపేట


