సిటీ జామ్‌ | - | Sakshi
Sakshi News home page

సిటీ జామ్‌

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

గిరి ప్రదక్షిణ వేళ ఆరు గంటలపాటు రోడ్లపైనే నరకయాతన

కాగితాలకే పరిమితమైన ప్రణాళికలు.. క్షేత్రస్థాయిలో గందరగోళం

భక్తులు, వాహనదారుల అవస్థలు..

అంబులెన్స్‌లకూ తప్పని నిరీక్షణ

వీఐపీ బందోబస్తుకు ప్రాధాన్యం..

నగరాన్ని గాలికొదిలేసిన యంత్రాంగం

మద్దిలపాలెం జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్‌

సాక్షి, విశాఖపట్నం: భక్తి పారవశ్యంతో మారుమోగాల్సిన విశాఖ మహానగరం.. మంగళవారం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలిరాగా.. ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లోపం, పోలీసు యంత్రాంగం సమన్వయ వైఫల్యం, ట్రాఫిక్‌ నిర్వహణలో నిర్లక్ష్యం కలిసి నగరాన్ని దాదాపు ఆరు గంటలపాటు స్తంభింపజేశాయి. గిరి ప్రదక్షిణ మార్గాలే కాదు.. నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసి, రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. భక్తులు ప్రదక్షిణ ప్రారంభించేందుకే అవస్థలు పడగా.. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణాలకు నాలుగైదు గంటలు పట్టిన పరిస్థితి నెలకొంది.

అడుగడుగునా ట్రాఫిక్‌ సంకెళ్లు

సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, ఇసుకతోట, మెడికవర్‌ జంక్షన్‌, హనుమంతవాక, గురుద్వార, సీతమ్మధార, మర్రిపాలెం, వేపగుంట, సింహాచలం, మారికవలస... నగరంలోని ప్రధాన మార్గాలన్నీ కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయాయి. అంగుళం కూడా కదలని ట్రాఫిక్‌లో చంటిపిల్లలు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోయారు. అత్యవసర వైద్యసేవలకు వెళ్తున్న అంబులెన్స్‌లు సైతం సైరన్లు మోగించుకుంటూ ట్రాఫిక్‌లోనే నిలిచిపోవడం యంత్రాంగం వైఫల్యాన్ని బహిర్గతం చేసింది.

భక్తికి ముందే ట్రాఫిక్‌ పరీక్ష

స్వామివారి నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సిన భక్తులకు.. ముందుగా ట్రాఫిక్‌ పరీక్ష ఎదురైంది. తొలిపావంచాకు చేరుకోవడానికే గంటల సమయం పట్టింది. పలు చోట్ల నడిచేందుకు కూడా దారి లేక భక్తులు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు. వెంకోజీపాలెం సమీపంలో తీవ్ర రద్దీ కారణంగా 20 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

స్పష్టత లేని ఆంక్షలు

ట్రాఫిక్‌ మళ్లింపులు చేసినా.. వాటిపై ముందస్తు సమాచారం లేకపోవడం గందరగోళాన్ని మరింత పెంచింది. మధురవాడ వైపు వెళ్లే వాహనాలను గంటల తరబడి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత లేక చాలామంది రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. కీలక జంక్షన్ల వద్ద తగిన సంఖ్యలో ట్రాఫిక్‌ సిబ్బంది లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

గత అనుభవాలు విస్మరణ

గతంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా సమస్యాత్మక జంక్షన్ల వద్ద రోప్‌ పార్టీల ద్వారా భక్తులు, వాహనాలను విడతలవారీగా పంపిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. ఈసారి అలాంటి కార్యాచరణ ఎక్కడా కనిపించలేదు. నెల రోజులుగా జరిగిన సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు.. కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.

వీఐపీ బందోబస్తు.. నగరానికి భారమైందా?

గిరి ప్రదక్షిణ వంటి లక్షలాది మంది భక్తులు పాల్గొనే కార్యక్రమం జరుగుతున్న రోజే భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యక్రమం నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన సిబ్బందిలో అగ్రభాగం వీఐపీ బందోబస్తుకు మళ్లించడంతో నగర ట్రాఫిక్‌ నిర్వహణ దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై అధికారుల నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.

నగరవాసుల ఆగ్రహం

‘లక్షలాది మంది భక్తులు వస్తారనే విషయం ముందే తెలిసి కూడా.. ఇంతటి ట్రాఫిక్‌ గందరగోళం ఎందుకు?’ అనే ప్రశ్న నగరమంతా వినిపించింది. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు భక్తి కంటే అవస్థలే ఎక్కువగా మిగిలాయని, ప్రత్యామ్నాయ మార్గాలు, సమర్థవంతమైన ట్రాఫిక్‌ నియంత్రణ, క్షేత్రస్థాయి సమన్వయం కల్పించడంలో యంత్రాంగం విఫలమైందని భక్తులు, నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement