దారులన్నీ దిగ్బంధం | - | Sakshi
Sakshi News home page

దారులన్నీ దిగ్బంధం

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

సింహాచలం/పెందుర్తి: స్వామి దర్శనం కోసం భక్తి పారవశ్యంతో తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు ఈసారి గిరి ప్రదక్షిణకు ముందే కష్టాలు ఎదురయ్యాయి. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలిపావంచాకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ ఆంక్షలు భక్తులకు చుక్కలు చూపించాయి. దారులన్నీ మూసివేయడంతో భక్తులు వాహనాలను దూర ప్రాంతాల్లోనే నిలిపి, కాలినడకన తొలిపావంచాకు చేరుకోవాల్సి వచ్చింది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు సిద్ధమైన భక్తులు.. ముందుగా మరో నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణాన్ని నడకతోనే ప్రారంభించాల్సి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తొలిపావంచాకు వెళ్లే ప్రధాన మార్గాలన్నింటినీ నియంత్రించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెందుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను కృష్ణరాయపురం వద్ద, గోపాలపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను వేపగుంట వద్దే నిలిపివేశారు. హనుమంతవాక మార్గంలో వచ్చే వాహనాలను ముడసర్లోవ వద్ద ఆపేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ వాహనాలను విడిచి నడక సాగించారు. వేపగుంట నుంచి పాత గోశాల వరకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

మరో 5 కిలోమీటర్ల నడక

గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు అసలు ప్రదక్షిణ కంటే ముందే నడక పరీక్ష ఎదురైంది. గోపాలపట్నం, వేపగుంట, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తులు తొలిపావంచాకు చేరుకునేందుకు ఐదు కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. హనుమంతవాక మార్గంలో వచ్చిన వారు ముడసర్లోవ నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు.

పాత అడవివరం మార్గంలో బురద బాట

పాత అడవివరం జంక్షన్‌ నుంచి తొలిపావంచాకు మళ్లించిన ప్రత్యామ్నాయ మార్గం భక్తులకు మరో సమస్యగా మారింది. హనుమంతవాక, శొంఠ్యాం మార్గాల నుంచి వచ్చే భక్తులను బీఆర్‌టీఎస్‌ రోడ్డులోకి అనుమతించకుండా గాంధీనగర్‌ మీదుగా మళ్లించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ మార్గం మొత్తం బురదమయమైంది. వేలాది మంది భక్తులు ఒకేసారి రావడంతో మార్గం ఇరుకుగా మారి, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జారే బురదలో అడుగులు వేస్తూ భక్తులు తొలిపావంచాకు చేరుకున్నారు.

వేపగుంటలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం

మరోవైపు పెందుర్తి–వేపగుంట మార్గంలో ట్రాఫిక్‌ నిర్వహణ పూర్తిగా అదుపు తప్పింది. గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన వాహనాలు, సాధారణ రాకపోకల వాహనాలు ఒకేసారి చేరడంతో వరలక్ష్మీనగర్‌ వద్ద ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపించింది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న రద్దీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. అనకాపల్లి, దేవరాపల్లి, సబ్బవరం, కె.కోటపాడు, పాడేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులతో రహదారులు కిక్కిరిశాయి. పార్కింగ్‌ ప్రాంతాల వద్ద నియంత్రణ లేకపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిచిపోయాయి. దీంతో గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు కూడా కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయారు. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ట్రాఫిక్‌ సమస్య కొనసాగింది.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లు

పెందుర్తి నుంచి నగరంలోని ఆస్పత్రులకు వెళ్లే మార్గాలు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. అత్యవసర చికిత్స కోసం రోగులను తరలిస్తున్న పలు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. పోలీసులు, స్థానికులు చొరవ తీసుకుని వాటిని బయటకు పంపించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement