ముగుస్తున్న గడువు.. గల్లంతవుతున్న వలస కూలీల ఓటుహక్కు పగటిపూట కూలీకి పోతే.. ‘తాళం’ సాకుతో ఎన్యూమరేటర్ల వెనకడుగు ‘ఇంట్లో లేరు’ అంటూ ఏరివేత.. తెరవెనుక అధికార పక్షం పెత్తనం! వలసదారుల గుండెల్లో రైళ్లు.. జూలై 21న ముసాయిదా లిస్ట్
మహారాణిపేట/మద్దిలపాలెం: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విశాఖ జిల్లాలో తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాల్సిన ప్రక్రియ.. వేలాది మంది వలస కూలీలు, రోజువారీ కార్మికులు, పేదల ఓటు హక్కుపై కత్తిలా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన వారిని, పగటిపూట కూలీ పనులకు వెళ్లే కార్మికులను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఎన్యుమరేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజల్లో సరైన అవగాహన కల్పించకుండానే ముగించేస్తున్న ఈ ప్రక్రియ వెనుక.. అధికార కూటమి పెద్దల పెత్తనం, రాజకీయ కుట్రలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వలస గుండెల్లో ‘ఓటు’ భయం
విశాఖ నగరంలో ఉపాధి కోసం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది వలసవచ్చి నివాసం ఉంటున్నారు. మద్దిలపాలెం, సీతంపేట, మాధవధార, పెద్ద వాల్తేరు, గోపాలపట్నం, మురళీనగర్, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాల్లో వలస కూలీల జనాభా ఎక్కువ. సాధారణంగా వీరికి స్వగ్రామంతో పాటు ఇక్కడి నగరంలోనూ ఓట్లు ఉన్నాయి. అయితే, ‘సర్’ నిబంధనల ప్రకారం ఆధార్ అనుసంధానంతో ఒకచోట మాత్రమే ఓటు ఉంచి, రెండో చోట తొలగిస్తున్నారు. కానీ, ఎన్యూమరేషన్ ఫారాలు అందని చోట ఆటోమేటిక్‌గా ఓటు గల్లంతవుతోంది. ఈ సాంకేతిక ప్రక్రియను ఆసరాగా చేసుకుని అధికార కూటమి నాయకులు ప్రతిపక్షాలకు పడే వలస ఓట్లను ఏరిపారేసే వ్యూహాత్మక కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి.
పొట్టకూటి కోసం పోతే.. ఓటు ఎగనామం
‘సర్’ ప్రక్రియపై రోజువారీ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తే.. చీకటి పడితే గానీ ఇళ్లకు చేరని పరిస్థితి వారిది. అయితే, ఎన్యుమరేటర్లు మాత్రం ప్రభుత్వ పనివేళలైన ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్లకు వస్తున్నారు. ఆ సమయంలో కూలీలు అందుబాటులో ఉండకపోవడంతో.. ‘డోర్‌లాక్’ (తాళం వేసి ఉంది) అనే సాకు చూపి ఓట్లను నమోదు చేయకుండా వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడుసార్లు ఇంటిని సందర్శించి ఫారం సేకరించాలి. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. ‘ఓటు హక్కు కోసం ఒక పూట పస్తుండాలా?’ అని తూర్పు నియోజకవర్గంలోని జీవీఎంసీ 15వ వార్డు కొండవాలు ప్రాంతాలు, అలాగే 16, 22, 23 వార్డుల్లోని రోజువారీ కూలీలు లబోదిబోమంటున్నారు. తాము ఇళ్ల వద్ద ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నమోదుకు అవకాశం కల్పించాలని, పేదల ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించవద్దని వేడుకుంటున్నారు.
అధికార పార్టీ పెత్తనం.. అధికారుల వత్తాసు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే ఈ ‘సర్’ కార్యక్రమం సాగుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు పైస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ప్రతి బీఎల్‌వో దగ్గర కూటమి నాయకులు తిష్టవేసి, తమకు వ్యతిరేకంగా ఉండే ఓట్లను ఏరివేసే పనిలో పడ్డారు. చనిపోయిన వారి ఓట్లను పూర్తిగా తొలగించాల్సి ఉండగా.. అక్కడ తప్పులు దొర్లాయి. కానీ, బతికున్న ఓటర్లపై రకరకాల కారణాలు చూపి, వ్యూహాత్మకంగా ఓట్లు తొలగించేందుకు మ్యాపింగ్‌ను గందరగోళంగా మార్చేశారు.
‘సర్’ అంటే ఏంటో తెలియని అమాయకత్వం
అసలు ‘సర్’ అంటే ఏంటో, ఓటును ఎలా కాపాడుకోవాలో నగరంలోని వలస కూలీలకు కనీస అవగాహన లేదు. అధికారులు కూడా ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్క్‌లు పెడుతున్నామని చెబుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల సేకరణ మందకొడిగా సాగుతోంది. జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌వోలు ఇళ్ల వద్దకు వెళ్లి ‘ఫారం–2’ సేకరించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 20.23 లక్షల మంది ఓటర్లు ఉండగా, 1980 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బీఎల్‌వోలు పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నా, వలస కూలీల ఇళ్లకు మాత్రం అధికారులు వెళ్లకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. చివరకు ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అప్పుడు ఏ ఏ వర్గాల ఓట్లకు ఎసరు పెట్టారో, ఎవరెవరి ఓట్లు గల్లంతయ్యాయో పూర్తిగా తేలనుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పేదవాడికి దూరం చేసే ఈ కుట్రలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


