ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో ఇకపై బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సందర్శకులను అలరించనుంది. జూ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ నల్ల చిరుత ఎన్‌క్లోజర్‌ను మంగళవారం రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ డాక్టర్ పి.వి.చలపతిరావు ప్రారంభించారు. జంతు మార్పిడి విధానంలో భాగంగా గత నెలలో దీనిని అసోం రాష్ట్రంలోని జూ పార్కు నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ బ్లాక్ పాంథర్‌ను దత్తత తీసుకోవడానికి ఒక చిన్నారి ముందుకు రావడం విశేషం. నిహిరా మలినేని అనే 21 నెలల చిన్నారి, తన తల్లిదండ్రుల సహకారంతో ఈ నల్ల చిరుతను ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఇందుకోసం రూ. 1,25,000 చెక్కును పీసీసీఎఫ్‌కు అందజేసింది. ఇంత చిన్న వయసులో జంతువుల పట్ల మక్కువ చూపి దత్తతకు ముందుకు వచ్చిన నిహిరాను, ఆమె కుటుంబ సభ్యులను పీసీసీఎఫ్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా, సాలిడ్ ఇన్సులేషన్ అనే సంస్థ జూలోని ఖడ్గమృగాన్ని ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు రూ.3లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. దాతలు ఇరువురికీ పీసీసీఎఫ్ దత్తత అంగీకార పత్రాలను అందజేస్తూ.. వన్యప్రాణుల సంరక్షణకు మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం, జూలో కొత్తగా అభివృద్ధి చేసిన స్లాత్ బేర్(ఎలుగుబంటి), తోడేలు, నక్కలు, రెడ్ వాలబీ ఎన్‌క్లోజర్లను కూడా ఆయన ప్రారంభించారు. సీఎఫ్ బి.మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లు పాల్గొన్నారు.
బ్లాక్ పాంథర్‌ను దత్తత తీసుకున్న 21 నెలల చిన్నారి


