భవ్య రూపం
అప్పన్న నిజరూప దర్శనంతో పరవశించిన భక్తులు తెల్లవారుజాము 3.20 నుంచి ఉచిత, రూ.300 దర్శనం ప్రారంభం
సింహాచలం : వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. సంవత్సరంలో ఒక్కరోజే కలిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి భక్తిరసంలో మునిగిపోయారు. చందనపు పొరల నుంచి వెలుగుచూసిన స్వామివారిని కళ్లారా చూసిన భక్తులు ఆధ్యాత్మికానందంలో తేలిపోయారు.
శాస్త్రోక్తంగా చందనం విసర్జన
పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచకలశారాధన వంటి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వెండి బొరుగులతో స్వామివారిపై ఉన్న పన్నెండు మణుగుల చందనాన్ని శ్రద్ధగా తొలగించి, నిజరూపంలో స్వామివారిని దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.
తొలిదర్శనం అనంతరం భక్తులకు దర్శనాలు
తెల్లవారుజాము 2.20 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. తెల్లవారుజాము 3.20 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు కల్పించారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. అప్పటివరకు క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దర్శనాలు కల్పించారు.
విశేషంగా సహస్ర ఘటాభిషేకం
రాత్రి జరిగిన సహస్ర ఘటాభిషేకం ఆధ్యాత్మికోత్సాహాన్ని మరింత పెంచింది. త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో గంగధార నుంచి తీసుకు వచ్చిన వెయ్యి కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అదేవిధంగా 108 వెండి కలశాలతో పంచామృతాలు, ఔషధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగులు(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమర్పించి స్వామి వారిని మళ్లీ నిత్యరూపంలో అలంకరించారు. అహోబిల రామానుజజీయర్, దేవనాఽఽథ్ జీయర్ స్వామి పాల్గొన్నారు.
దర్శించుకున్న ప్రముఖులు: స్వామి నిజరూప దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, సి.ఎం.రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, కాకినాడ కలెక్టర్ హరేందిరప్రసాద్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్‌భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జేసీ విద్యాధరి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
నీలాద్రిగుమ్మం వద్ద హడావుడి
సమయం దాటినా
అంతరాలయ దర్శనాలు
సింహాచలం: చందనోత్సవం వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున హడావుడి చోటుచేసుకుంది. తెల్లవారుజాము 2.20 గంటల సమయంలో తొలిదర్శనం చేసుకునేందుకు అశోక్‌గజపతిరాజు వచ్చేసరికే చాలామంది ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో ఉన్నారు. ఆయన దర్శనం చేసుకోగానే హోంమంత్రి అనిత దర్శనం చేసుకున్నారు. అప్పటికే రూ.1500 టికెట్ కల్గిన ప్రముఖులకు అంతరాలయ దర్శనం ప్రారంభించారు. ఈ తరుణంలోనే నీలాద్రిగుమ్మం వద్ద పెద్ద ఎత్తున తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఎంతకీ క్యూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రూ.1500 టికెట్‌పై వచ్చే ప్రముఖులకు తెల్లవారుజాము 3.30 నుంచి 5 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆ సమయం దాటినా కూడా కొందరు ప్రముఖులు రావడంతో వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ ఎంపీ భరత్ ఉదయం 5.13 గంటల సమయంలో అంతరాలయ దర్శనానికి వెళ్లడం విశేషం. ఆ తర్వాత మరికొందరు ప్రముఖలు దర్శనం చేసుకున్న తర్వాత ఉదయం 5.40 గంటల సమయంలో అంతరాలయం దర్శనాలు నిలుపుచేశారు. నీలాద్రిగుమ్మం వద్ద నెలకొన్న హడావుడితో అప్పటికే ప్రారంభమైన ఉచిత దర్శనం, రూ.300 దర్శనం భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. నీలాద్రిగుమ్మం వద్దే ఎక్కువ మంది పోలీసులు కూడా విధులు నిర్వర్తించడంతో దేవస్థానం ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. మరోపక్క నీలాద్రిగుమ్మం వద్దే ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు తమవాళ్లను ఇష్టానుసారంగా దర్శనానికి పంపించడం విశేషం. పోలీసుల దర్శనాలు కూడా అధికంగా చోటుచేసుకున్నాయి.
పట్టు వస్త్రాల సమర్పణ
చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి కూడా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగుతూ వస్తోంది.
కూటమి నేతలకే ప్రోటోకాల్ దర్శనం
సైడ్ లైట్స్
ఉచిత దర్శనం, రూ.300 దర్శనంల క్యూల్లోకి భక్తులు ఆదివారం రాత్రి నుంచే చేరుకున్నారు.
ఉచిత దర్శనం రెండు క్యూలుగా ఏర్పాటు చేసినా నిరంతరం రెండు లైన్లు భక్తులతో రద్దీగానే ఉన్నాయి.
దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సీసీ మోనిటర్‌లో ఎప్పటికప్పుడు క్యూల రద్దీని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
మధ్యాహ్నం నుంచి క్యూల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్యూలు పలుమార్లు ముందుకు కదల్లేదు.
దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు వాహనాన్ని టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమేర వాగ్వాదం చోటుచేసుకుంది.
సాయంత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా ప్రకటించిన విధంగా సాయంత్రం 6 గంటల నుంచే కొండపైకి బస్సులను నిలుపుదల చేశారు. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు.
ఈసారి 1.25 లక్ష మంది స్వామిని దర్శించుకున్నట్లు అంచనా.
తెల్లవారు 2.12 గంటలకు కేశఖండనశాల వద్ద 30 ఏళ్ల మహిళ స్పృహ తిరిగి పడిపోయారు.
రూ.300 క్యూలైన్‌లో మధ్యాహ్నం 1.10 సమయంలో ఎండ తీవ్రతకు పలువురు స్పృహ కోల్పోయారు.
సాక్షి, విశాఖపట్నం: వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వేళ యంత్రాంగం వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. ఏడాదికి ఒక్కసారి లభించే నిజరూప దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు అధికారుల అతి జాగ్రత్త, సమన్వయ లోపం కారణంగా అల్లాడిపోయారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకే ప్రోటోకాల్ దర్శనమని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాయంత్రం వరకు కూటమి ప్రజాప్రతినిధులు, వారి బంధుమిత్రులు, అధికారుల కుటుంబ సభ్యులే ప్రోటోకాల్ పేరుతో దర్శనాలు చేసుకున్నారు. దీనివల్ల రూ.1000, రూ.1500 టికెట్లు కొన్న భక్తులు కూడా 4 నుంచి 5 గంటల పాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది.


