భక్తులకు అష్టకష్టాలు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అష్టకష్టాలు

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

సాయంత్రానికి తాకిడి పెరగడంతో

ఒక్కసారిగా గందరగోళం

కొండ దిగువ నుంచి స్తంభించిన రవాణా వ్యవస్థ

ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో

గంటలపాటు భక్తుల పాట్లు

మెట్లమార్గం, ఘాట్‌ రోడ్‌ల్లో

ఉరుకులు పరుగులు

ఉదయం నుంచి సాయంత్రం వరకు

పోలీసుల చేతుల్లో ‘వీఐపీ’ క్యూలైన్‌

పెందుర్తి/ఆరిలోవ: చందనోత్సవ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికార యంత్రాంగం సమన్వయలోపం వెరసి వేలాది భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రద్దీ లేని సమయంలో తీరుబడిగా ఉన్న అధికారులు.. అసలు సమయం వచ్చేసరికి ఓ దశలో పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భక్తులు సోమవారం సాయంత్రం పడరాని పాట్లు పడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. మెట్ల మార్గం.. ఘాట్‌ రోడ్లు మీదుగా కిలో మీటర్ల మేర కొండ ఎక్కి అంత్యంత గందరగోళ పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకున్నారు.

ఉదయం ప్రశాంతం..

సాయంత్రం గందరగోళం

దాదాపు 2 లక్షల మంది భక్తులు చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ ఓ మాదిరిగా ఉండడంతో ఏర్పాట్ల లోపాలు అంతగా కనిపించలేదు. కానీ సాయంత్రం 3 గంటల తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండు మూడు గంటల వ్యవధిలో వేలాది భక్తులు కొండ దిగువకు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో బస్సులు మందకోడిగా కదిలాయి. ఈ క్రమంలో పోలీసులను, ఆర్టీసీ అధికారులను పలు చోట్ల భక్తులు తీవ్రస్థాయిలో నిలదీశారు. చాలామంది భక్తులు పరిస్థితిని గమనించి మెట్ల మార్గం, ఘాట్‌ రోడ్లు వెంబడి ఆపసోపాలు పడుతూ నడుస్తూ క్యూలైన్లకు చేరుకున్నారు.

పోలీసులందరూ వీఐపీలే..

చందనోత్సవం వేళ మరోసారి పోలీసుల తీరు విమర్శలపాలైంది. కిందిస్థాయి నుంచి అధికారుల వరకు వందలాది మంది పోలీసులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో రూ.1500 క్యూలైన్‌ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద పాస్‌లు లేకపోయినా సమయం చూసుకుని పోలీస్‌ అధికారులు వారిని క్యూలైన్లలోకి పంపడం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే టికెట్లు లేకపోయినా పోలీసులంతా సపరివార కుటుంబ సమేతంగా వీఐపీ హోదాలో దర్శనం చేసుకున్నారు.

కాళ్లు కాలి అవస్థలు : స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు చెప్పులు విడిచిపెట్టడంతో ఎండ తీవ్రతకు తీవ్ర అవస్థలు పడ్డారు. కేవలం కొన్నిచోట్ల మాత్రమే మ్యాట్‌ వేయడంతో మిగిలిన చోట్ల నడిచిన భక్తులంతా పాదాలు మంటలు పుట్టి ఇబ్బందులు పడ్డారు. అయితే భక్తుల అవస్థలు చూసి కంటితుపుడు చర్యగా జీవీఎంసీ అధికారులు ట్యాంకర్లతో నీటిని రోడ్లుపై వేసినా అవి కొన్ని నిమిషాల్లోనే ఎండకు ఆవిరైపోయాయి.

మూసిన మెట్ల దారి: అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మెట్ల మార్గాన్ని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆర్టీసీ బస్సుల కొరత

కొండపైకి వెళ్లేందుకు కేవలం ఆర్టీసీ బస్సులే దిక్కు కావడంతో భక్తులు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణించారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.

భయంతో వెనుదిరిగాం..

సాయంత్రం అయితే దర్శనం చేసుకోవచ్చని వచ్చాం. కానీ బస్‌లు కదలకపోవడంతో పరిస్థితి బాలేదని గమనించాం. భయంతో ఇంటికి వెనుదిరిగాం. రవాణా వ్యవస్థ సరిగా నడపలేదు. – దొరబాబు, భక్తుడు

తొలిసారి వచ్చాను..

దర్శన భాగ్యం లేదు..

తొలిసారి అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ బస్‌ ఎక్కే పరిస్థితి లేదు. బస్టాండ్‌లో భక్తుల నియంత్రణ కూడా లేదు. బస్‌లో ప్రయాణం చేసేందుకు మూడు గంటలు వేచి ఉన్నాను. కానీ కుదరకపోవడంతో స్వామి దర్శనం లేకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను.

– కల్యాణి, భక్తురాలు, కూర్మన్నపాలెం

Advertisement
 
Advertisement
Advertisement