1933 డిసెంబర్ 8వ తేదీన ప్రారంభించిన ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనం, జైపూర్ మహారాజు విక్రం దేవ్ వర్మ విగ్రహం
మద్దిలపాలెం: శాస్త్ర విజ్ఞానానికి, పరిశోధనాత్మక వికాసానికి బలమైన పునాదిగా నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల భవనం, విశాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఏయూ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా వెలుగొందుతున్న ఈ భవనం వెనుక ఎంతో గొప్ప నేపథ్యం దాగి ఉంది. 1931 డిసెంబర్ 1వ తేదీన అప్పటి చాన్సలర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ జార్జ్ ఫ్రెడరిక్ స్టాన్లీ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ అందించిన సహకారంతో కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ అద్భుత నిర్మాణం పూర్తి చేసుకుంది. 1933 డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ భవనం, నేటికీ తన నిర్మాణ శైలితో ఆశ్చర్యపరుస్తోంది.
రాజుల కోట తలపించేలా..
రాజుల కోటలను తలపించేలా భారీ ఎత్తులో..శిల్పకళా చాతుర్యంతో నిర్మితమైన ఈ భవనం, నాడు విద్యా రంగానికి రాజులు ఇచ్చిన ప్రాధాన్యతను చాటి చెబుతుంది. కళాశాల ప్రాంగణంలో భక్తులకు, సందర్శకులకు నేటికీ ‘జైపూర్ విక్రమ్ దేవ్ వర్మ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల’ అనే అక్షరాలు చెక్కిన శిలాఫలకాలు దర్శనమిస్తాయి. భవనం ముందు భాగంలో ఉన్న జైపూర్ మహారాజు విగ్రహం, 1937లో ప్రముఖ శిల్పి డీపీ రాయ్ చౌదరి చేతుల మీదుగా రూపొందగా, అది నేటికీ ఎంతో గౌరవంగా నిలిచి ఉంది. 92 ఏళ్లు గడిచినా చెక్కుచెదరని ఈ రాతి కట్టడం విశ్వవిద్యాలయానికే తలమానికం. ఒకప్పుడు ఈ భవనంపై ఏర్పాటు చేసిన భారీ గడియారం, విశాఖలోని సుదూర ప్రాంతాల వారికి కూడా సమయాన్ని తెలియజేస్తూ ఒక మైలురాయిలా ఉండేది. కాలం మారుతున్నా, తన అద్భుతమైన నిర్మాణ శైలి కారణంగా ఈ భవనం నేటికీ అనేక చలనచిత్రాల చిత్రీకరణకు వేదికగా నిలుస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ సాంకేతిక వికాసానికి, శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంగా, చారిత్రక వారసత్వ సంపదగా ఈ సైన్స్ కళాశాల భవనం నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.


