డాబాగార్డెన్స్: జీవీఎంసీ మైదానాల్లో వాకర్స్, క్రీడాకారులపై విధించిన యూజర్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా ప్రియదర్శిని, స్వర్ణభారతి వంటి స్టేడియాల్లో నడక సాగించే వారిపై రూ.720, క్రీడాకారుల శిక్షణ నిమిత్తం (ప్రైవేటు నిర్వాహకులు) రూ.12 నుంచి రూ.15 వేల వరకు చార్జీలు వసూలు చేయాలని చూడటం దారుణమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉందని, వేల కోట్ల బడ్జెట్ ఉండి కూడా పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చడం సరికాదని హితవు పలికారు. ప్రజల నుంచి రకరకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, క్రీడా మైదానాల్లో మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించాలని ఆయన కోరారు.


