సాక్షి, విశాఖపట్నం : సంస్థ అభివృద్ధికి నిత్యం కాంక్షిస్తూ.. పనిచేస్తున్న సీ ఫేరర్ల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ స్పష్టం చేశారు. విశాఖ సముద్ర జలాల్లో ఉన్న డ్రెడ్జ్–21 నౌకను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకలోని కెప్టెన్లు, మాస్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఇతర సిబ్బందితో సుదీర్ఘంగా మాట్లాడారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు, క్లిష్ట పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రెడ్జింగ్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే అంశంపై ఎండీ ఆరా తీశారు. ఈ సందర్భంగా కెప్టెన్ దివాకర్ మాట్లాడుతూ సంస్థకు వెన్నెముకలా నిలుస్తున్న సిబ్బందితో నేరుగా మమేకమవ్వాలనే సంకల్పంతో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. సంస్థ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న సీఫేరర్ల సంక్షేమం, వారి సాధికారతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఐ అధికారులు పాల్గొన్నారు.
డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్


