తాటిచెట్లపాలెం: పద్మపూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 13 కేంద్రాల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో 560 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అత్యధికంగా శ్రీకాకుళంలో 80 మంది రక్తదానం చేయగా.. విశాఖ, గణపవరం, కై కలూరు ప్రాంతాల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ, వందేభారత్, న్యూ విజన్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మపూజిత గ్రూప్ చైర్మన్ బసవరాజు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక యూనిట్ రక్తం ముగ్గురు నలుగురి ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలకు, వలంటీర్లకు ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది.


