పీఏలే బాస్‌లు | - | Sakshi
Sakshi News home page

పీఏలే బాస్‌లు

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

● భీమిలిలో ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాలన
ఎమ్మెల్యే గంటా ఇలాకాలో ముగ్గురు పీఏల మధ్య కుదిరిన ‘వాటాల’ ఒప్పందం ఒకరికి భూములు.. మరొకరికి వసూళ్లు.. ఇంకొకరికి పోస్టింగ్‌ బాధ్యతలు ఫోన్లు ఎత్తరు.. పనులు చేయరు.. ‘సొంత’ నేతల మధ్యే రగులుతున్న ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

మ్మెల్యే గంటా గంటా శ్రీనివాసరావు ఇలాకాలో అసలు కథ వేరే ఉంది. అక్కడ ప్రజాప్రతినిధి మాట కంటే.. పీఏలకే పవర్‌ ఎక్కువ. ముగ్గురు పీఏలు.. మూడు రాజ్యాలుగా భీమిలిని విభజించుకుని, అధికారమే అండగా దండుకోవడమే అజెండాగా చెలరేగిపోతున్నారు. భూములు ఒకరికి.. వసూళ్లు మరొకరికి.. పోస్టింగులు ఇంకొకరికి అన్నట్లుగా సాగుతున్న ఈ ’పీఏల ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దందాతో ప్రజలు నట్టేట మునుగుతున్నారు. సొంత పార్టీ క్యాడర్‌కే ముల్లోకాలు చూపిస్తున్న ఈ ముగ్గురు మొనగాళ్ల తీరు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

అప్పనంగా వాటాలు.. నిలువునా దోపిడీ

భీమిలిలో ఈ ముగ్గురు పీఏల మధ్య పని విభజన భలేగా జరిగింది. ‘కంచే చేను మేసిన చందంగా’.. ఎవరికి కేటాయించిన విభాగాల్లో వారు యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒకరు పూర్తిస్థాయిలో భూ వ్యవహారాలు, మున్సిపాలిటీ పనులను చక్కబెడుతుంటే.. మరొకరు సింహాచలం దేవస్థానం భూములు, టీడీఆర్‌లు, కాంట్రాక్టుల మీద కన్నేశారు. ఇక మూడో వ్యక్తి ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీల వ్యవహారాలను డీల్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యం’ అన్నట్టు, ముగ్గురు కలిసి నియోజకవర్గాన్ని విభజించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్లలో ఒకరైతే ఏకంగా ఒక ఎంపీకి చెందిన ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తూ, ఎమ్మెల్యేను మించిన స్థాయిలో ఆస్తులు కూడబెట్టారనే టాక్‌ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

నిజానికి ఈ ముగ్గురు పీఏల మధ్య మొదట్లో అస్సలు పడేది కాదు. ఎవరికి వారు పైచేయి సాధించడానికి సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అయితే, వీరి గొడవ బజారున పడటంతో పెద్దలు రంగప్రవేశం చేసి రాజీ కుదిర్చారట. ‘అందరం కలిసి ముంచేద్దాం’ అన్నట్లుగా ఇప్పుడు ఎవరి ఏరియా ఏమిటో విభజించుకున్నారు.

● మరొకరు పోస్టింగులు, భూ లావాదేవీలు, వసూళ్లలో జోక్యం చేసుకుంటూ అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ‘కోడి గుడ్డు పెట్టక ముందే పిల్లల్ని లెక్కపెట్టినట్టు’ ముందుగానే లావాదేవీలు ఫిక్స్‌ చేస్తున్నారనే చర్చ ఉంది. ఈయన తీరుతో అధికారులే తల పట్టుకుంటున్నారు.

● ప్రధానంగా అనధికారికంగా పీఏగా వ్యవహరించే వ్యక్తి భూముల వ్యవహారాల్లో ‘మొత్తం మింగేస్తున్నాడు’ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో భూసమీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో రైతుల నుంచి కొద్ది మొత్తం డిమాండ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రతి పనికీ ధర కట్టేశారన్న అసహనం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

● సింహాచలం దేవస్థాన భూములు, ఆక్రమణలు, బీఆర్‌టీఎస్‌ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు.. దేవస్థాన పోస్టింగుల నుంచి కాంట్రాక్టుల వరకు వ్యవహారాలన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏ కమ్‌ పీఆర్‌వోగా వ్యవహరించే సదరు వ్యక్తి ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లుగా అధికారాన్ని, ఆదాయాన్ని పిండేస్తున్నారు.

కోల్డ్‌ వార్‌ నుంచి.. ‘కాసుల’ ఒప్పందం వరకు..

కార్యకర్తలకు చుక్కలు

పీఏలు హాయిగా వాటాలు పంచుకుంటుంటే.. కష్టపడి పార్టీని గెలిపించిన కార్యకర్తలు మాత్రం ‘నోట్లో వెలక్కాయ పడ్డట్టు’ అయోమయంలో పడిపోయారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని, పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పద్మనాభం మండలంలో జరిగిన సమావేశంలో ఇదే అంశంపై నేతలు గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముగ్గురు పీఏలు కలిసి తమకు ‘ముల్లోకాలు చూపిస్తున్నారు’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తినట్టు సమాచారం. ‘ముందు వెనక చూసుకోకుండా చెలరేగిపోతున్న’ ఈ పీఏల వైఖరి వల్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ్రాఫ్‌ పడిపోతోందని, క్యాడర్‌ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని సీనియర్‌ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement