చందన స్వామి నిజరూప దర్శనానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

చందన స్వామి నిజరూప దర్శనానికి వేళాయె

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

ఉదయం 3.30 నుంచి ఉచిత, రూ.300 దర్శనం

రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేత

రాత్రి 8 నుంచి సహస్ర ఘటాభిషేకం, తొలి విడత చందన సమర్పణ

సింహాచలం: సింహగిరిపై అవతరించిన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ వేళయింది. వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని స్వామివారు సోమవారం తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఏడాదంతా చందన రూపుడి(నిత్యరూపం)గా కనిపించే స్వామి మణుగుల చందనం నుంచి బయటకు వచ్చి, నిజరూపంతో దర్శనమివ్వనున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. వేకువజాము 3 గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి భక్తులకు ఉచిత, రూ.300 దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటల నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి శ్రీవైష్ణవస్వాములు కలశాలతో తీసుకొచ్చిన నీటితో స్వామివారి నిజరూపానికి అభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం, విశేష పూజల అనంతరం తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి మరల నిత్యరూపభరితున్ని చేస్తారు. నిజరూప స్వామికి ధరింపజేసే శిరోచందనం, హృదయచందనాన్ని వైదికులు ఇప్పటికే సిద్ధం చేశారు.

పటిష్ట ఏర్పాట్లు : ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా. ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1,500ల దర్శనం టికెట్ల క్యూలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. టికెట్లపై పొందుపరిచిన సమయాల(స్లాట్ల) ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరి పైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. దర్శనానంతరం దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ మేరకు 40 గ్రాముల లడ్డూలను లక్షా 50 వేలు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,300 మందితో పోలీస్‌ బందోబస్తు, సింహగిరిపై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. డ్రోన్‌ సాంకేతికను వినియోగిస్తున్నారు.

భక్తులందరికీ అన్నప్రసాదం : చందనోత్సవానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం అందించనున్నారు. కొండ దిగువ శ్రీకృష్ణాపురంలోని గోశాల, అడవివరం జంక్షన్‌, తొలిపావంచా, సింహపురికాలనీ, శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం కల్యాణమండపాల వద్ద కేవలం లడ్డూ ప్రసాదాలు మాత్రమే విక్రయిస్తారు. ఈ మేరకు 80 గ్రాముల లడ్డూలు సుమారు లక్ష సిద్ధం చేశారు.

ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత

చందనోత్సవం ఏర్పాట్లను ఆదివారం హోంమంత్రి అనిత పరిశీలించారు. దర్శనాల క్యూలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత చందనోత్సవ అనుభవాల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్‌ అధికారులు హోంమత్రికి తెలియజేశారు. మంత్రి వెంట దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ఈవో జె.వెంకటరావు, డీసీపీ–2 మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు.

300 బస్సులు

డాబాగార్డెన్స్‌: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్‌టీసీ 300 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రధానంగా ద్వారకా బస్టేషన్‌, గాజువాక నుంచి 60 చొప్పున, విజయనగరం, చోడవరం, కొత్తవలస నుంచి 50 చొప్పున, అనకాపల్లి నుంచి 40 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు కొండపైన, గోశాల, అడవివరం వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక షటిల్‌ సర్వీసులను నడుపుతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement