● రూ.10 కోట్ల విలువ లేని సంస్థకు వందల కోట్ల విలువైన పోర్టు ధారాదత్తం ● మత్స్యకారులను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తాడు ● కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజం
సాక్షి, విశాఖపట్నం : జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని, కేవలం రూ. 10 కోట్ల నికర విలువ కూడా లేని సంస్థకు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత్స్యకారులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీలు ఇవ్వడం తప్ప, ఆ వర్గాల సంక్షేమం గురించి ఆయన ఎన్నడూ పట్టించుకోలేదని వాసుపల్లి విమర్శించారు. గతంలో తాను టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విషయాలను అసెంబ్లీలో, టీడీఎల్పీ సమావేశాల్లో పలుమార్లు నిలదీసినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు చేసింది శూన్యమని, బోట్లు మునిగిపోయినప్పుడు బీమా రెన్యువల్ చేయలేదనే సాకుతో నష్టపరిహారం ఎగ్గొట్టిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో దోచుకున్న రూ. 150 కోట్లతో ఒక ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. దీనికి భిన్నంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని వాసుపల్లి కొనియాడారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ. 155 కోట్లు కేటాయించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జువ్వలదిన్నెలో రూ. 300 కోట్లతో 79 ఎకరాల్లో 1250 బోట్ల సామర్థ్యంతో నిర్మించిన హార్బర్‌ను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మూసివేసి, రూ. 40 కోట్ల పెట్టుబడి పెట్టే ‘సాగర్ డిఫెన్స్’ సంస్థకు రూ. 200 కోట్ల విలువైన ఆస్తులను అప్పగించడం వెనుక భారీగా కమీషన్లు చేతులు మారాయని ఆరోపించారు. 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ భూములను వెనక్కి తీసుకుని మత్స్యకారులకే అప్పగిస్తామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన ఉత్సవాలను రెవెన్యూ శాఖకు అప్పగించి, కార్పొరేట్ తరహాలో మార్చి భక్తులకు కనీస దర్శన సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఫిషింగ్ హార్బర్ మాజీ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకి రామ్, మాజీ కార్పొరేటర్ దౌలపల్లి ఏడుకొండల రావు, పార్టీ నాయకులు గనగళ్ల రామరాజు, ఈశ్వర్, సాగర్, బొడ్డు ఆనంద్, అప్పారావు, చోడిపల్లి శివ, వాసుపల్లి బంగారమ్మ, చింతపల్లి లీల కృష్ణ, సూరిని రాము, వేణు, చేపల రాజు, అచ్యుత్, గనగాళ్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు.


