ఐసీయూలో ‘ప్రాణవాయువు’ | - | Sakshi
Sakshi News home page

ఐసీయూలో ‘ప్రాణవాయువు’

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

అత్యవసరంలో

అందని ఆక్సిజన్‌

అలంకార ప్రాయంగా నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లు

నిర్వహణ లోపం.. ప్రాణ సంకటం

రూ.15 లక్షల రిపేరుకు

దిక్కులేదు.. రూ.40 లక్షల

దోపిడీకి అడ్డులేదు

మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్లు నిధులు లేక, నిర్వహణ కరువై దిష్టిబొమ్మల్లా మారాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్‌ కష్టకాలంలో ఎందరో ప్రాణాలు కాపాడేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటి నిర్వహణను గాలికి వదిలేయడంతో, నేడు ఆరు ప్లాంట్లలో నాలుగు పూర్తిగా మూలనపడ్డాయి. కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే అరకొరగా పని చేస్తుండటంతో రోగులకు ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నచిన్న మరమ్మతులకూ

వెనకడుగు

ఈ ప్లాంట్లలో ప్రెషర్‌ గేజ్‌, డ్రయ్యర్‌, కంప్రెషర్‌ వంటి చిన్నపాటి సాంకేతిక సమస్యలు మాత్రమే ఉన్నాయి. కేవలం రూ. 15 లక్షలు ఖర్చు చేస్తే నాలుగు ప్లాంట్లు పునరుద్ధరణకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా, దానిని పక్కనపెట్టి ప్రైవేటు సంస్థల నుంచి నెలకు రూ. 40 లక్షలు వెచ్చించి ఆక్సిజన్‌ను కొనుగోలు చేస్తున్నారు. అంటే ఏడాదికి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తుల పాలు చేస్తున్నారు.

రోగుల ప్రాణాలతో చెలగాటం

రోజూ 2,000 మందికి పైగా ఓపీ, వందలాది మంది ఇన్‌పేషెంట్లు వచ్చే కేజీహెచ్‌లో 26 విభాగాలకు ఆక్సిజన్‌ అత్యవసరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు వేలల్లో వసూలు చేసే ఆక్సిజన్‌ బిల్లులు భరించలేక పేదలు కేజీహెచ్‌కు వస్తుంటే, ఇక్కడ ప్లాంట్లు పాడైపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి, మొక్కుబడి మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల కుటుంబాలు కోరుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement