ఆరిలోవ: భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీని ప్రభావం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలపై స్పష్టంగా కనిపిస్తోంది. సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గిపోవడంతో జూ పార్కు వెలవెలబోతోంది. ఆదివారం జూలో తగ్గిన సందర్శకుల సంఖ్యే దీనికి నిదర్శనం. సాధారణంగా సెలవు రోజుల్లో, ముఖ్యంగా వీకెండ్‌లో జూ పార్కు సందర్శకులతో కళకళలాడుతుంటుంది. కానీ, కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావడానికి సాహసించడం లేదు. దీంతో ఈ ఆదివారం జూను కేవలం 2,461 మంది మాత్రమే సందర్శించారు. వీరి ద్వారా సుమారు రూ. 2,13,000 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా వీకెండ్ రోజుల్లో ఆదాయం రూ.3లక్షలకు పైగా ఉండేదని పేర్కొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు.


