మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ నిష్టల శ్రీనివాస్
మహారాణిపేట: చాతీలో మంట, కడుపులో అసౌకర్యం, గ్యా స్ సమస్యలు రాగానే చాలామంది వెంటనే వేసుకునేవి యాంటాసిడ్ మాత్రలు. తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే ఈ మాత్రలు చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయాయి. అయితే.. వైద్యుల సలహా, పర్యవేక్షణ లేకుండా వీటిని దీర్ఘకాలం పాటు వాడటం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ నిష్టల శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు. వరల్డ్ లివర్ డే పురస్కరించుకుని ఆదివారం ఆయన మాట్లాడారు. ‘యాంటాసిడ్లను వైద్యుల సూచన మేరకు, సరైన మోతాదులో, పరిమిత కాలం పాటు వాడితే ప్రయోజనకరమే. కానీ, వాటిని నిర్లక్ష్యంగా దీర్ఘకాలం పాటు వాడటమే అసలు సమస్య. దీని వల్ల పోషకాల లోపం, రక్తహీనత, ఎముకల బలహీనత వంటి ఎన్నో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలు వేధిస్తున్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.’ అని సూచించారు. నిరంతర అలసట, కండరాల నొప్పులు, తల తిరగడం, గుండె దడ, చేతులు లేదా కాళ్లు మొద్దుబారడం, విపరీతంగా జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మెడికవర్ ఆసుపత్రుల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.


