ఆంగ్ల వ్యామోహంలో అమ్మభాషను మరువద్దు | - | Sakshi
Sakshi News home page

ఆంగ్ల వ్యామోహంలో అమ్మభాషను మరువద్దు

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

సీతంపేట: త్రిభాషా విధానం వల్ల మాతృభాషకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. తెలుగుదండు ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో జరిగిన ‘మాతృభాష అభివృద్ధికి మార్గమేమి?’అనే చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు భాషల విధానంలో మాతృభాషకు సముచిత స్థానం ఉందని, ఇది ఉత్తరాది భాషలను రుద్దడం కాదని స్పష్టం చేశారు. మాతృభాషకు మొదటి శత్రువులు తల్లిదండ్రులేనని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా వికాసం ఇంటితో మొదలై, నేడు పాఠశాలల్లోనే అంతమవుతోందని పేర్కొన్నారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో మాతృభాషను పక్కన పెట్టడం సరికాదన్నారు. మారుమూల ప్రాంతంలో జన్మించిన సినీ కవి సి.నారాయణరెడ్డి డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమంలో చదివినప్పటికీ, తెలుగు సినీ కవిత్వంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలుగు భాష వికాసం కోసం అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష కేవలం బడి భాష మాత్రమే కాదని, అది అమ్మ ఒడి భాష అని, జాతికి గమ్యాన్ని చూపేదని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు, భాషా ఉద్యమకారుడు డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని పత్రికలు, పుస్తకాల్లో భాషా దోషాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రస్తుత వ్యవస్థలోనూ ఈ లోపం కనిపిస్తోందని ఆవేదన చెందారు. ఏయూ మాజీ రిజిస్ట్రార్‌ వెలగపూడి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. పిల్లల్లో మాతృభాషకు పునాది వేయాల్సింది తల్లిదండ్రులేనని స్పష్టం చేశారు. సాహిత్య విమర్శకుడు డి.వి.సూర్యారావు మాట్లాడుతూ.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచాలని కోరారు. తెలుగుదండు పరవస్తు విద్యాపీఠం ఫణిశయన సూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గజల్‌ రచయిత చల్లా రాంబాబు, మజ్జి దేవిశ్రీ, పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు.

డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement