రణస్థలం: రణస్థలం జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు వదిలేస్తుంటే.. ఏమీ చేయలేక ఆ తండ్రి విలపించిన తీరు స్థానికులను కంటపడి పెట్టించింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. విశాఖలోని మల్కాపురంలో నివాసం ఉంటున్న పంది దీనబంధు, తన కుమారుడు ప్రేమ్‌కుమార్(15)తో కలిసి ఆదివారం స్కూటీపై శ్రీకాకుళం వచ్చారు. అక్కడ జరిగిన డిఫెన్స్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రేమ్‌కుమార్ హాజరయ్యాడు. పరీక్ష ముగిసిన అనంతరం ఇద్దరూ స్కూటీపై తిరిగి విశాఖపట్నం బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో రణస్థలం టౌన్ వద్దకు రాగానే, ఒక లారీని ఓవర్‌టేక్ చేయబోతుండగా వీరి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న దీనబంధు రోడ్డుకు ఒకవైపు తుళ్లిపోగా, వెనుక కూర్చున్నప్రేమ్‌కుమార్ మాత్రం ప్రమాదవశాత్తూ లారీ చక్రాల కిందకు పడిపోయాడు. లారీ వెనుక చక్రం తల పైనుంచి వెళ్లడంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. దీనబంధు మాల్కాపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బురద రామచంద్రాపురం పంచాయతీ శేఖరపురం. దీనబంధుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాద స్థలంలో లారీ కింద ఉన్న మృతుడు ప్రేమ్‌కుమార్, రోదిస్తున్న తండ్రి దీనబంధు


