అపురూప చిత్రాలు.. అందమైన బొమ్మలు | - | Sakshi
Sakshi News home page

అపురూప చిత్రాలు.. అందమైన బొమ్మలు

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

మద్దిలపాలెం: బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘కళా సెంటినియల్‌ సాగా’ప్రదర్శన ప్రారంభమైంది. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యుల సృజనాత్మకతకు ఈ వేదిక ప్రతిరూపంగా నిలిచింది. ప్రముఖ చిత్రకారుడు ఆచార్య జి.రవీందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌, విశ్రాంత ఆచార్యులు వి.రమేష్‌, మయూఖ కుమారి దేవి, విభాగాధిపతి డి.సింహాచలం, ఆచార్యులు శిష్ట్లా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ముఖ్యంగా ఆయిల్‌ పెయింటింగ్స్‌, ప్రింట్స్‌, దారు శిల్పాలు, పీవోపీ, ఇత్తడి, మోల్డింగ్‌లో తయారు చేసిన శిల్పాలు ప్రకృతిని, సామాజిక పరిస్థితులను, మానవ ఆలోచనలను ప్రతిబింబిస్తూ కనువిందు చేశాయి. ప్రతి కళాఖండం వెనుక ఉన్న అంతరార్థాన్ని విద్యార్థులు వివరించిన తీరు కళాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను నగరవాసులు, కళాకారులు తిలకించాలని ఆచార్య సింహాచలం కోరారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, ఎల్‌జీ ఇండియా సీఎస్సార్‌ ప్రతినిధి సంగ్‌ యున్‌ కిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకుంటున్న ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌

Advertisement
 
Advertisement
Advertisement