డాబాగార్డెన్స్: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జ్ఞాపకార్థం విశాఖపట్నంలో స్మారక భవనాన్ని నిర్మించాలని జిల్లా శ్రీశయన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు తోట వాసుదేవరావు కోరారు. గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జడ్జి కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట వాసుదేవరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. లచ్చన్న ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. షీలానగర్ నుంచి సబ్బవరం వెళ్లే రహదారిలో లచ్చన్న స్మారక భవనాన్ని నిర్మించి, అక్కడ ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు కూడా పాల్గొన్నారు.


