క్వార్టర్స్ ఫైనల్‌కు ప్రొఫెషనల్ సీసీ
గతేడాది రన్నరప్‌కు షాక్
విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ డీఎస్‌ఆర్ స్మారక టీ–20 టోర్నీలో గతేడాది ఫైనలిస్ట్ ఆశ్రయ సీసీకి ప్రొఫెషనల్ సీసీ జట్టు షాక్ ఇచ్చి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో టాస్ గెలిచిన ఆశ్రయ సీసీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ కె.ప్రకాష్(76 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించాడు. ఏవీఎన్ మూర్తి మూడు వికెట్లు తీశాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొఫెషనల్ సీసీ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. అవినాష్ (34), కిట్టు (38), మధు (33) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి బౌలర్లలో శ్రీను మూడు, హమీద్ రెండు వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో శ్రీ ప్రకాష్ సీసీ ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది. వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జాలీ రోవర్స్ సీసీ ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. సూపర్ స్టార్స్ సీసీ ఏడు వికెట్లకు 136 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది. అలాగే భీమిలి క్రికెట్ సంఘంతో జరిగిన పోరులో శివాజీ సీసీ బౌలర్ మురళీ ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో భీమిలి జట్టు 127 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం శివాజీ సీసీ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.
క్వార్టర్స్ ఫైనల్‌కు ప్రొఫెషనల్ సీసీ


