లారీ ఢీకొని ఉక్కు ఉద్యోగి దుర్మరణం
కూర్మన్నపాలెం: కూర్మన్నపాలెం ముఖ్య కూడలి వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలివి. విశాఖ ఉక్కు కర్మాగారంలోని టీపీపీ విభాగంలో సీనియర్ టెక్నీ షియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉరిటి బోయన్న (52) అగనంపూడి పినమడక కాలనీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం బీ–షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు ఆయన తన బైక్‌పై బయలుదేరారు. కూర్మన్నపాలెం కూడలి వద్ద కుడి వైపునకు మలుపు తిరుగుతుండగా.. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న లారీ ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయన్న కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బోయన్న మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


