విద్యుత్ షాక్‌తో ట్రాలీ డ్రైవర్ మృతి
చింతపల్లి: విద్యుత్ షాక్ తగిలి ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన కోరుకొండ సమీపంలో చోటుచేసుకుంది. అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని చెరువూరు–ఇటుకబెడ్డలు గ్రామాల మధ్య ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల కోసం శుక్రవారం విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ట్రాలీ డ్రైవర్ ములగపాటి శ్రీనివాసరాజు జేసీబీ యంత్రాన్ని తీసుకుని కోరుకొండ ప్రాంతం చెరువూరుకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇటుకబెడ్డలు గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు జేసీబీకి తగలడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ శ్రీనివాసరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వెంటనే వాహనం నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుడు పెదగంట్యాడ మండలం గాజువాక సుందరయ్య కాలనీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


