అధికార లాంఛనాలతో డాక్టర్ ఆదినారాయణరావు అంత్యక్రియలు
మహారాణిపేట: ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ సుంకరి వెంకట ఆదినారాయణరావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ఘనంగా ముగిశాయి. ఆయన భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, సంఘసేవకులు తరలివచ్చి అశ్రునయనాలతో నివాళులర్పించారు. పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన ఆయన సేవలను స్మరించు కున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ మానవతావాదిగా గుర్తింపు పొందిన ఆయనకు 2022లో కేంద్ర ప్రభుత్వం ’పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం మహారాణిపేటలోని నివాసం నుంచి భౌతిక దేహాన్ని ఊరేగింపుగా జిల్లా పరిషత్ సమీపంలోని అంకోశా ఆడిటోరియానికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, అంతిమ యాత్ర నిర్వహించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డాక్టర్ ఆదినారాయణరావు మరణం వైద్య రంగానికి, ముఖ్యంగా పేదలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార లాంఛనాలతో డాక్టర్ ఆదినారాయణరావు అంత్యక్రియలు


