పంచ్ పవర్
2 నిమిషాల్లో 730 పంచ్‌లతో సరికొత్త చరిత్ర
రికార్డుల రారాజు ‘పెదిరెడ్ల’
కలామ్స్ వరల్డ్ రికార్డులో వైజాగ్ మాస్టర్
మధురవాడ: సినిమాల్లో హీరోలు విలన్లను చితక్కొట్టడం చూసుంటాం. కానీ నిజ జీవితంలో అంత వేగంగా, అంత కచ్చితత్వంతో పిడిగుద్దులు(పంచ్‌లు) కురిపించడం సాధ్యమేనా?.. సాధ్యమే అని నిరూపిస్తున్నారు పీఎంపాలెంకి చెందిన కరాటే మాస్టర్ పెదిరెడ్ల కనకారావు. గాల్లో తూటాల్లా దూసుకెళ్లే పంచ్‌లతో సరికొత్త రికార్డులను తిరగరాస్తూ, అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నారు. తాజాగా మరో అరుదైన రికార్డుతో కలామ్స్ వరల్డ్ రికార్డు బుక్–2026లో చోటు దక్కించుకున్నారు.
2 నిమిషాల్లో
730 పంచ్‌లు
మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్‌లో నిష్ణాతుడైన కనకారావు గత ఏడాది అక్టోబర్‌లో ఓ అద్భుత ప్రదర్శన చేశారు. కేవలం 2 నిమిషాల వ్యవధిలో, ఏకధాటిగా 730 ఫుల్ ఎక్స్‌టెన్షన్ పంచ్‌లు కొట్టి ఔరా అనిపించారు. అలుపెరుగని ఈ సాహసానికి గుర్తింపుగా తాజాగా ’కలాం వరల్డ్ రికార్డు’లో ఆయన పేరు నమోదు కావడం విశేషం.
రికార్డుల
పరంపర..
కనకారావుకు రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. పంచ్‌లు విసరడంలో తనకు తానే సాటి అని గతంలోనూ నిరూపించుకున్నారు. 2024లో వాటర్ పూల్‌లో నిలబడి 34 నిమిషాల 19 సెకన్లలో ఏకంగా 6,113 పంచ్‌లు విసిరి కలాం రికార్డు సాధించారు. అలాగే అదే ఏడాది నీటిలో ఒక్క నిమిషంలో 280 నాన్–స్టాప్ పంచ్‌లు కొట్టి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. కేవలం కరాటేలోనే కాకుండా యోగాలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2023లో కాళ్లను 180 డిగ్రీల కోణంలో చాపి(హెడ్ స్టాండ్ వైల్డ్ లెగ్ పోజ్), తలకిందులుగా 4 నిమిషాల 19 సెకన్ల పాటు నిలబడి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కారు. 2024లో కేవలం 30 సెకన్లలో 184 ఫుల్ ఎక్స్‌టెన్షన్ పంచ్‌లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
మెరికల్లాంటి విద్యార్థుల తయారీ
తాను రికార్డులు సాధించడమే కాకుండా, తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను కూడా భావి రికార్డుల వీరులుగా తీర్చిదిద్దుతున్నారు కనకారావు. ఆయన శిక్షణలో అనీషా జై వారధి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం సన్నద్ధమవుతుండగా.. రేవళ్లపాలెంకి చెందిన లక్ష్మీనారాయణ 3 నిమిషాల్లో 1000 పంచ్‌లు కొట్టే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. పీఎంపాలెం వేదికగా ఎంతోమంది యువతకు మార్షల్ ఆర్ట్స్, యోగాలో ఉత్తమ తర్ఫీదునిస్తూ కనకారావు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరాటేలోవిన్యాసాలు
పంచ్ పవర్
పంచ్ పవర్


