జూ ఆదాయం రూ.4.91 లక్షలు
ఆరిలోవ: ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. సంక్రాంతి సెలవులకు తోడు ఆదివారం కావడంతో వేల సంఖ్యలో పర్యాటకులు జూని సందర్శించారు. వన్యప్రాణులను తిలకిస్తూ వాటి ఎన్‌క్లోజర్ల వద్ద పర్యాటకులు సరదాగా గడిపారు. ముఖ్యంగా పులులు, జింకలు, జిరాఫీలు, నల్ల హంసలు, ఏనుగులు, బాతుల ఎన్‌క్లోజర్ల వద్ద పిల్లలు కేరింతలు కొట్టారు. ఆదివారం మొత్తం 5,844 మంది సందర్శకులు వచ్చినట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు. వీరి ద్వారా జూ పార్కుకు రూ. 4,91,900 ఆదాయం సమకూరిందని ఆమె వివరించారు. సందర్శకులలో అత్యధికులు సొంత కార్లలో వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


