స్మార్ట్ తిప్పలు
మిగిలిన కార్డులను సరెండర్ చేయండి
మనుషులు ఒకచోట.. కార్డులు మరోచోట
జిల్లాలో ఇంకా పంపిణీ కాని కార్డులు 59,152
కార్డు లేదని నిలిచిన రేషన్
మహారాణిపేట: ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఒక ప్రహసనంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాత కార్డుల స్థానంలో ఈ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టగా, నేటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే అనేక మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులు అందకపోవడం గమనార్హం. కార్డుల కోసం ప్రజలు సచివాలయాలకు వెళ్తే, అక్కడ తమకు కార్డులు రాలేదని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. నివాసం ఒకచోట ఉంటే, కార్డులు మరొక చోట ఉన్నాయన్న సమాచారంతో లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వాకబు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. చివరకు కార్డుల ఆచూకీ తెలియక ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిపోయిన కార్డులను తిరిగి సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి కార్డులు అందజేశారు. మిగిలిన కార్డులను రేషన్ డిపోలకు సరఫరా చేశారు. ఈ పంపిణీ పర్యవేక్షణ కోసం డీఎస్‌వో ఆధ్వర్యంలో ఏఎస్‌వోలు, చెకింగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించి సచివాలయాలు, చౌకధరల దుకాణాల వారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 5,17,155 స్మార్ట్ రేషన్ కార్డులు ఉండగా, ఇప్పటివరకు 4,58,003 కార్డుల పంపిణీ పూర్తయినట్లు డీఎస్‌వో వి.భాస్కరరావు తెలిపారు. అంటే దాదాపు 89 శాతం పంపిణీ ముగిసింది. ఇంకా 59,152 కార్డులు పంపిణీ కావాల్సి ఉంది. ఇవన్నీ ప్రస్తుతం డీలర్ల పర్యవేక్షణలో ఉన్నాయని, కార్డులు కావలసిన వారు డీలర్లను గానీ, ఏఎస్‌వో లేదా డీఎస్‌వో కార్యాలయాలను గానీ సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే మనుషులు ఒకచోట, కార్డులు మరొకచోట ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డిపోలకు వెళ్తే తమ వద్ద లేవని, కొద్దిరోజుల తర్వాత రావాలని డీలర్లు చెబుతున్నారు. సచివాలయాల్లోనూ, ఏఎస్‌వో కార్యాలయాల్లోనూ ఆచూకీ లభించడం లేదు. చివరకు కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న డీఎస్‌వో కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో కార్డుదారులు అయోమయంలో పడుతున్నారు. మరోవైపు ఈ కార్డులు లేని కారణంగా గత రెండు నెలలుగా రేషన్ సరుకులు నిలిచిపోవడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కార్డులు లేకపోయినా రేషన్ ఇచ్చారు కానీ, డిసెంబర్, జనవరి నెలల్లో కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని నిబంధన పెట్టారు. సరిగ్గా సంక్రాంతి పండగ సమయంలో రేషన్ సరుకులు అందకపోవడంతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ గందరగోళాన్ని తొలగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


