రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
కూర్మన్నపాలెం: తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం వేదికగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. జీవీఎంసీ 86వ వార్డు పరిధిలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బలప్రదర్శనకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా..
కూర్మన్నపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ శ్రేణులను, కూటమి నేతలను విస్మయానికి గురిచేశాయి. వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఒక వర్గంగా, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ మరో వర్గంగా విడిపోయారు. ఎవరికి వారు పోటాపోటీగా ఒకరి పక్కనే మరొకరు టెంట్లు వేసి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఏ టెంట్‌కు వెళ్లాలో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్ధం ఈ కార్యక్రమంతో బహిర్గతమైంది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతుతో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ తన పట్టు పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగానే కార్పొరేటర్ టెంట్‌కు ఆనుకొనే మరో టెంట్ వేసి భారీగా కార్యకర్తలు, కూటమి నేతలను సమీకరించారు. నివాళుల అనంతరం చీరల పంపిణీ, విందు భోజనాలు ఏర్పాటు చేసి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా కార్పొరేటర్ లేళ్ల కూడా ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడంతో వర్ధంతి కాస్తా పోటీ సమావేశాలుగా మారిపోయింది.
మాటల తూటాలు..
ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరోక్ష విమర్శలతో వేడి రగిల్చారు. వార్డు అధ్యక్షుడు నల్లూరి మైకులో మాట్లాడుతూ.. ‘కుళ్లు రాజకీయాలు చేస్తే సహించేది లేదు. వయసు పైబడిన వారు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాలు, ఇతర కార్యక్రమాల పేరుతో డబ్బులు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలి’ అని కార్పొరేటర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే మనిషినని, ఆయన మాటే శిరోధార్యమని స్పష్టం చేశారు. కార్పొరేటర్ వర్గీయులు తమ టెంట్‌లోని మైకుల్లో సౌండ్ పెంచి సినిమా డైలాగులతో కౌంటర్ ఇచ్చారు. ‘టికెట్ కాదు కదా.. గేటు కూడా తాకనివ్వం’ అనే అర్థం వచ్చేలా సినిమా డైలాగులను ప్లే చేయడం అక్కడి ఉద్రిక్తతను పెంచింది.
ఎన్టీఆర్ సాక్షిగా.. టీడీపీలో
రచ్చకెక్కిన విభేదాలు


