ప్లాట్‌ఫాంపై మర్చిపోయిన బ్యాగ్ అప్పగింత
అగనంపూడి: రైలు ఎక్కే తొందరలో ప్లాట్‌ఫాంపై మర్చిపోయిన బ్యాగును, అందులోని విలువైన బంగారు ఆభరణాలు, నగదును దువ్వాడ ఆర్పీఎఫ్ పోలీసులు సురక్షితంగా యజమానులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలివి. శ్రీనగర్‌కు చెందిన దత్తి అన్నంనాయుడు తన భార్యతో కలిసి విజయవాడ వెళ్లేందుకు ఆదివారం ఉదయం 6.40 గంటలకు దువ్వాడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక్కడ కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. అదే సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడం, రైలు కదిలిపోతుందేమోనన్న ఆందోళనతో వారు హడావుడిగా రైలు ఎక్కారు. ఈ క్రమంలో తమ వెంట తెచ్చుకున్న బ్యాగును ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైనే మర్చిపోయారు. అయితే, స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బుడుమూరు వెంకటరమణ అప్రమత్తంగా వ్యవహరించి, ప్లాట్‌ఫాంపై ఉన్న బ్యాగును గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రైలు ఎక్కిన కొంతసేపటికే బ్యాగ్ లేని విషయాన్ని గుర్తించిన అన్నంనాయుడు దంపతులు, తదుపరి స్టేషన్‌లో దిగి దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆర్పీఎఫ్ సిబ్బందిని సంప్రదించగా, బ్యాగ్ సురక్షితంగా తమ వద్దే ఉందని తెలిపారు. అనంతరం బాధితులు స్టేషన్‌కు చేరుకోగా, పోలీసుల సమక్షంలో బ్యాగును తెరిచి పరిశీలించారు. అందులో రెండు తులాల బంగారు నగలు, రూ. 4,000 నగదు భద్రంగా ఉండడంతో వాటిని అన్నంనాయుడుకు అందజేశారు. తమ బ్యాగ్ దొరకడంతో అన్నంనాయుడు దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పక్షం రోజుల కిందట కూడా సీసీ కెమెరాల ద్వారా ఇటువంటి ఘటనే గుర్తించి, ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ బాధితులకు న్యాయం చేసిన విషయం తెలిసిందే.


