సంక్షేమానికి కూటమి గ్రహణం
అధికారం చేపట్టి ఏడాదిన్నరైనా అమలుకు నోచుకోని పథకాలు
పూర్తిస్థాయిలో అమలుకాని సూపర్ సిక్స్
ఇంకా పట్టాలెక్కని మహిళా నిధి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు
ఉన్నవి పోయి.. కొత్తవి రాక లబ్ధిదారుల ఇక్కట్లు
వెలవెలబోతున్న జిల్లా ఎస్సీ, బీసీ సంక్షేమ కార్యాలయాలు
కేంద్ర పథకాల అమలులోనూ నిర్లక్ష్యం వీడని చంద్రబాబు ప్రభుత్వం
ఎంవీపీ కాలనీ: సూపర్ సిక్స్ పథకాల పేరిట భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా, జిల్లాలో సంక్షేమ పథకాల ఊసే లేకుండా పోయింది. ఆయా వెనుకబడిన వర్గాల కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్లు అడపదడపా జిల్లాకు వచ్చినప్పుడు ‘త్వరలోనే పథకాలు అమలు’అంటూ బాకాలు ఊదడం మినహా.. జిల్లా వాసులకు లభించిన సంక్షేమం శూన్యంగా మారింది. సంక్షేమ పథకాల అమలులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలకంగా వ్యవహరించిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, పథకాల అమలు దిశగా ఏడాదిన్నరగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో జిల్లా సంక్షేమ భవన్‌లోని కార్పొరేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.
నాడు నవరత్నాలతో పాటు సంక్షేమం
గత ప్రభుత్వం రైతు భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, చేయూత, చేదోడు, మత్స్యకార భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి పలు పథకాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందించి కొత్త శకానికి నాంది పలికింది. వీటితో పాటు ఆయా జిల్లాల కార్పొరేషన్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, పాస్టర్లకు గౌరవ వేతనం, దివ్యాంగులు/మాజీ సైనికులకు స్వయం ఉపాధి రుణాలు, వైఎస్సార్ పెళ్లి కానుక, యువ న్యాయవాదులకు గౌరవ వేతనం వంటి పథకాలను అమలు చేసింది. ఐదేళ్లపాటు నిర్విరామంగా ఆయా పథకాలు లబ్ధిదారులకు అందాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరే ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా చర్యలు తీసుకున్నారు.
సూపర్ సిక్స్‌తో పాటు సంక్షేమమూ నిల్
సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఏడాదిన్నర గడిచినా పలు పథకాల ఊసెత్తడం లేదు. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలైన.. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, యువతకు 20 లక్షల ఉద్యోగ/ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి వంటివి నేటికీ అమలుకు నోచుకోలేదు. కనీసం 2019కి ముందు మాదిరిగా జిల్లా కార్పొరేషన్ల ద్వారానైనా పాత విధానంలో పథకాలు అమలు చేస్తారని ఆశించినా, ఏడాదిగా ఆ దిశగా ముందడుగు పడలేదు. దీంతో ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
సర్వేలు మినహా బీసీలకు చేసింది శూన్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో బీసీ సంక్షేమ శాఖ పలు సర్వేలు నిర్వహించింది. 2014 నుంచి బీసీ రుణాలు పొందిన వారి వివరాల సేకరణ, రుణాలు పొందిన వారిలో ఎంతమంది వృత్తిని కొనసాగిస్తున్నారు అనే అంశంపై ఆడిట్, బీసీల తలసరి ఆదాయంపై అధ్యయనం వంటి సర్వేలకే పరిమితమైంది. చంద్రబాబు సర్వేల జపంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికై నా బీసీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆ సామాజికవర్గ లబ్ధిదారులు ఆశించారు. అయితే సర్వేల పేరిట ఏడాదిగా కాలయాపన చేయడం మినహా చేసిందేమీ లేకపోవడంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించిన ‘ఆదరణ’పథకం కిందైనా 2025–26 ఏడాదికి సబ్సిడీ రుణాలు వస్తాయని ఆశించినప్పటికీ, అదీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఫలితంగా జిల్లాలోని బీసీ లబ్ధిదారులకు వృత్తిపరమైన పనిముట్లు, వ్యాపార యూనిట్లు పొందే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు 2024–25 ఆర్థిక సంవత్సరం చివర్లో(మార్చిలో) హడావుడిగా కాపు, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, ఈబీసీ తదితర కార్పొరేషన్ల రుణాల మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తు గడువును కేవలం 12 రోజుల్లోనే ముగించడం పట్ల తీవ్ర దుమారం రేగింది. కేవలం ఆయా కార్పొరేషన్ల పరిధిలోని కూటమి కార్యకర్తలకు రుణాలు మంజూరు చేసేందుకే ఈ నోటిఫికేషన్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత పాలనలో బీసీ కార్పొరేషన్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఎంబీసీ రుణాలు, మైనారిటీ సంక్షేమ రుణాలు ఐదేళ్లపాటు జిల్లాలోని లబ్ధిదారులందరికీ అందడం గమనార్హం.
సంక్షేమానికి కూటమి గ్రహణం


