సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి సర్కార్‌

Aug 2 2025 6:05 AM | Updated on Aug 2 2025 6:05 AM

సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి సర్కార్‌

సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి సర్కార్‌

మహారాణిపేట: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లకు ప్రాధాన్యత లభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.కొండారెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన ‘సంక్షేమ హాస్టళ్ల బాట’ కార్యక్రమం ముగిసింది. ముందుగా జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి.చైతన్యతో కలిసి కొండారెడ్డి తదితరులు జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్‌కు హాస్టళ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ప్లకార్డులతో నిరసన ప్రదర్శన

‘బొద్దింకల భోజనం, నీళ్ల పప్పు, పులిసిపోయిన పెరుగు మాకొద్దు. దోమలకు ఆహారంగా ఉండలేం. నేల మీద పడుకోలేం’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. హాస్టళ్లలో సరైన నిధులు లేకపోవడంతో పురుగుల బియ్యంతో వండిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయలు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాస్మొటిక్‌ చార్జీలు, మెనూలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డు, చిక్కీ, చికెన్‌ వంటివి కూడా సక్రమంగా అందడం లేదన్నారు. హాస్టల్‌ వార్డెన్లను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు తులసి, పిలకా మోహన్‌, సందీప్‌, రవికాంత్‌, విష్ణువర్ధన్‌, సర్ఫరాజ్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంక్షోభంలో హాస్టళ్లు

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇళ్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3,878 ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయని ఆరోపించారు. వాటిలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 6,35,864 మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement