
10 రెస్టారెంట్లు, దాబాలకు నోటీసులు
బీచ్‌రోడ్డు: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాలను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మొత్తం 20 బృందాలు ఏకకాలంలో 40 హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై దాడులు చేశాయి. ఈ తనిఖీల్లో భాగంగా 42 ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. పరిశుభ్రత పాటించని 10 రెస్టారెంట్లు, దాబాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించి, 17 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఈ తనిఖీల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులను రప్పించినట్లు ఆయన పేర్కొన్నారు.