
అన్నదాత కు పంగనామం
● అర్హులకు దూరంగా ‘అన్నదాత సుఖీభవ’ ● రైతు సాయంపై కూటమి ప్రభుత్వం అడ్డంకులు ● వైఎస్సార్ సీపీ హయాంలో 25,072 మందికి రైతు భరోసా ● కూటమి ప్రభుత్వంలో 18,573 మందికే..
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయంపై కోత విధించింది. గతంతో పోలిస్తే అర్హులైన రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో వేలాది మందిని పథకం నుంచి తొలగించింది. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా నిలిపివేసిన ప్రభుత్వం, ఈ ఏడాది విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు గల్లంతయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అర్హుల సంఖ్యలో భారీ కోత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద 25,072 మంది రైతులకు నిధులు అందించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద కేవలం 18,573 మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేసింది. దీని ప్రకారం సుమారు 6,499 మంది రైతులు ఈ పథకం నుంచి తొలగించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘ప్రధాన మంత్రి కిసాన్’ పథకం కింద 18,100 మందిని అర్హులుగా ఎంపిక చేశారు.
నిబంధనల పేరుతో ఇబ్బందులు
కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల కారణంగా కౌలు రైతులు, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, 10 సెంట్ల కన్నా తక్కువ భూమి ఉన్నవారు పథకానికి దూరమయ్యారు. అలాగే ఆధార్, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధాన సమస్యలు, వేలిముద్ర, ఓటీపీ ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది లబ్ధి కోల్పోయారు. ప్రభుత్వం అవగాహన కల్పించడంలో విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు.
రైతులకు పెట్టుబడి కష్టాలు
పెట్టుబడి సహాయం అందక గిరిజన, ఇతర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో దుక్కి పనులు, నాట్లు, కలుపుతీత వంటి ఖర్చుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది నుంచి వ్యవసాయం భారంగా మారడంతో కొంతమంది సాగుకు దూరమవుతున్నారని చెబుతున్నారు.