
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఖరీదైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని ఖేఖాతరు చేస్తోంది. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఐటీ కంపెనీల ముసుగులో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టింది.
👉బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నెంబర్–4లో 30 ఎకరాలను ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 50 శాతం ఐటీ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన 50 శాతం రిటైల్, గృహ నిర్మాణం వంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకో వచ్చని, ఇందుకు విశాఖపట్నం మెట్రోపా లిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపాందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
👉ఇదే విధంగా కపిల్ చిట్స్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎండాడ వద్ద 10 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో 40 శాతం భూమిని అసోసియేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరిట రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అసోసియేట్ ఇన్‌ఫ్రా పేరిట ఉద్యోగులకు గృహ సముదాయాలు, రిటైల్, వినోదం, మెడికల్, ఎడ్యుకేషన్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.
ఏఎన్‌ఎస్‌ఆర్‌కు 99 పైసలకే 10.29 ఎకరాలు..
👉ఇక బెంగళూరుకు చెందిన మరో సంస్థ ఏఎన్‌ఎస్‌ఆర్‌కు మధురవాడ హిల్ నెంబర్–3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్–4లో 7.79 ఎకరాలు మొత్తం 10.29 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాక.. ఐటీ ఇన్‌ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయి తీలు కల్పించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
👉సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్‌కు మధురవాడ హిల్ నెంబర్–3లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలతో పాటు పరదేశీపాలం వద్ద ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీచేసింది.
👉అలాగే, ఫినోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నెంబర్–4లో మరో నాలుగు ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. వీటితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని విడుదల చేస్తూ కాటంనేని భాస్కర్ మరో ఉత్తర్వు జారీ చేశారు.