
ఈ ‘యాప్’సోపాలు మాకొద్దు
పనిభారంతో ఆన్‌లైన్ సేవలు నిలిపివేసిన
అంగన్‌వాడీ కార్యకర్తలు
మర్రిపాలెం: యాప్‌ల ద్వారా పనిభారం పెరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం నుంచి ఆన్‌లైన్ సేవలను నిలిపివేశారు. పోషణ ట్రాకర్, బాలసంజీవని యాప్‌లలో లబ్ధిదారుల నమోదును తాత్కాలికంగా ఆపేశారు. అదనంగా ఆరోగ్యశాఖకు చెందిన ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన’ పథకం నమోదు కూడా తమకే అప్పగించడంపై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్‌లలో నమోదుతో పాటు అనేక రికార్డులను నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. దీనికి తోడు పాత ఫోన్‌లు, సర్వర్ సమస్యలతో లబ్ధిదారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందన్నారు. అధికారులు అప్పగించిన మాతృత్వ వందన యోజన పథకం నమోదును తిరిగి ఆరోగ్యశాఖకు అప్పగించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన యాప్‌లను ఒకే యాప్‌గా మార్చాలని, నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగస్టు 4న తమ ఫోన్‌లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సీడీపీఓ నీలిమకు వినతిపత్రం అందజేశారు.

ఈ ‘యాప్’సోపాలు మాకొద్దు