
భూ సంబంధిత సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహారాణిపేట : ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్ ఆర్.గోవిందరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీ–సర్వేను వేగవంతం చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గోవిందరావు ఆదేశించారు. గ్రామ, మండల సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. వివాదాలు లేని ప్రభుత్వ ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో కె. భవాని శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మహదుర్, ఏడీ సర్వే శాఖ కె. సూర్యారావు, మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్
అదనపు డైరెక్టర్ గోవిందరావు