
జిల్లాలో 93.55 శాతం పింఛన్ల పంపిణీ
మహారాణిపేట: జిల్లాలో ‘ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు’ పంపిణీ చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పర్యవేక్షణలో మొత్తం 1,60,778 పింఛన్లకు గాను రాత్రి 8 గంటల సమయానికి 1,50,410 మందికి (93.55శాతం) పింఛన్లు అందజేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.70.36 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.65.60 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలలో కొత్తగా 2,524 మంది వితంతువులకు, 19 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, నగరంలో జీవీఎంసీ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. మిగిలిన పింఛన్లను శనివారం సచివాలయాల్లో పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు.