పన్ను వసూలు @ 510 కోట్లు
● లక్ష్యానికి మించి వసూలు ● జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ హరేందిర ప్రసాద్
డాబాగార్డెన్స్: రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన జీవీఎంసీ పరిధిలో 6 లక్షలకు పైగా ఆస్తి/ఖాళీ స్థల అసెస్‌మెంట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో సుమారు రూ.510 కోట్లు (రాత్రి 9 గంటల సమయానికి) ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో ప్రజలు, వివిధ సంస్థలు భారీ స్థాయిలో తమ ఆస్తి పన్నులు చెల్లించారు. జీవీఎంసీ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ.454 కోట్లు వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే జీవీఎంసీ పరిధిలో రూ.56 కోట్లు అదనంగా వసూలైంది. అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం కృషి ఫలితంగా సోమవారం రాత్రి 9 గంటల వరకు రూ.510 కోట్లు (రూ.510,31,90,354) వసూలైందని, రాత్రి 12 గంటల వరకు అన్ని సౌకర్య కేంద్రాలు పనిచేస్తున్నందున ఈ వసూలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్ తెలిపారు.


