నడక నేర్పిన డాక్టర్ ఇక లేరు
మహారాణిపేట: లక్షలాది మంది పోలియో బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుంకరి వెంకట ఆదినారాయణ శనివారం కన్నుమూశారు. ఎస్.వి.ఆదినారాయణగా నగర ప్రజలకు సుపరిచితులైన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించినా.. విశాఖనే తన కర్మభూమిగా మార్చుకుని ఆయన చేసిన సేవలు అజరామరం.
సేవయే ఊపిరిగా.. : ఆర్థోపెడిక్ సర్జన్‌గా డాక్టర్ ఆదినారాయణ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం వైద్యం చేయడమే కాకుండా, పేదలకు అండగా నిలిచారు. ముఖ్యంగా పోలియో బాధితుల పాలిట ఆయన దేవుడిగా మారారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పోలియో బాధితులకు శస్త్ర చికిత్సలు నిర్వహించి, వారికి నడకను, ఆత్మవిశ్వాసాన్ని నేర్పా రు. ఫ్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీగా, ప్రేమ ఆసుపత్రి డైరెక్టర్ జనరల్‌గా వేలాది మంది దివ్యాంగులకు పునరావాసం కల్పించారు. వైద్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 2014లో శిశు సంక్షేమ సేవలకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
విద్యాభ్యాసం.. వృత్తి జీవితం
1939 జూన్ 30న భీమవరంలో జన్మించిన ఆయన 1966లో ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 1970లో ఎం.ఎస్(ఆర్థో) పూర్తి చేశారు. ఏఎంసీలో ట్యూటర్ స్థాయి నుంచి ప్రొఫెసర్‌గా ఎదిగారు. రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విశేష సేవలందించారు. డాక్టర్ ఆదినారాయణ భార్య డాక్టర్ ఆర్. శశిప్రభ ప్రముఖ గైనకాలజిస్ట్, మాజీ డీఎంఈ. వీరికి ఇద్దరు సంతానం. డా.శేష్ కమల్, డా. శశి కిరణ్ వీరిద్దరూ ప్రస్తుతం యూకేలో వైద్యులుగా స్థిరపడ్డారు. కేవలం వైద్యానికే పరిమితం కాకుండా, విశాఖ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఆదినారాయణ పనిచేశారు. విశాఖకు జాతీయ స్థాయి టోర్నమెంట్లను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల విశాఖ వైద్య లోకం, ప్రముఖులు, ఆయన ద్వారా పునర్జన్మ పొందిన వేలాది మంది తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


