పచ్చని భవిష్యత్తు కోసం ‘హరిత సైనికులు’
తాటిచెట్లపాలెం: మన పచ్చని భవిష్యత్తు కోసం గ్రీన్ కై ్లమేట్ టీం ఆధ్వర్యంలో హరిత సైనికులు(గ్రీన్ సోల్జర్స్) బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఆర్‌యూ, జీవీఎంసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస రాజమణి తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని 150 ఏళ్ల చరిత్ర గల పురాతన మర్రిచెట్టు వద్ద శనివారం గ్రీన్ కై ్లమేట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీనివాస రాజమణి మాట్లాడుతూ.. పుడమి పచ్చదనంతో కళకళలాడేందుకు హరిత సైనికుల కృషి ఎంతో అవసరమన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించడానికి వీరు కృషి చేస్తారని తెలిపారు. ఇందులో చేరే యువత తమ స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇవ్వడంతో పాటు, అనంతరం వారు సొంతంగా జీవించడానికి ఉపాధి కల్పన, వీరి ద్వారా నిరుపేదలను, నిరాశ్రయులను గుర్తించి వారికి చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రీన్ కై ్లమేట్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం మాట్లాడుతూ.. గ్రీన్ సోల్జర్స్ కోసం పలువురు మిత్రులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖలతో కలిసి తమ ఎన్జీవో కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 50 వేల నారు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శివలక్ష్మి, యాక్షన్ ఎయిడ్(కర్ణాటక ప్రాజెక్ట్స్) సంస్థ అనకాపల్లి హెచ్‌ఆర్‌డీ ఐ.కృష్ణకుమారి, గ్రీన్ వలంటీర్ జె.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


