విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం
విశాఖ వేదికగా ముగిసిన గురుపూజోత్సవం
పాశ్చాత్య దేశాల్లో ప్రతిధ్వనిస్తున్న భారతీయ యోగా మార్గం
స్పానిష్ భాషలో భగవద్గీత సారం
ఆధ్యాత్మిక వారధి మాస్టర్ సీవీవీ
ఖండాంతరాలు దాటిన ఆధ్యాత్మిక వెలుగులు
మేడమ్ బ్లావెట్‌స్కీ రచనల్లోని మన్వంతర రహస్యాలు, మాస్టర్ ఈకే ఆచరణీయ యోగ బోధనలు జగద్గురు పీఠం ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యాయి. మాస్టర్ పార్వతీకుమార్ చేసిన 65 విదేశీ పర్యటనల ఫలితంగా వందలాది మంది పాశ్చాత్యులు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. నేడు విదేశాలలో ఉన్న సుమారు 30 ఆధ్యాత్మిక బృందాలు ఈ సనాతన ధర్మ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. –లుడ్జర్ ఫిలిప్స్, ట్రస్ట్ గ్లోబల్ కో– ఆర్డినేటర్, స్విట్జర్లాండ్
ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శి
మాస్టర్ సీవీవీ గురుపూజోత్సవాలు కేవలం వేడుకలు మాత్రమే కావు, అవి సనాతన ధర్మాన్ని, ప్రాచీన విజ్ఞానాన్ని భావితరాలకు అందించే ఆధ్యాత్మిక వారధులు. 1962లో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గుంటూరులో ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అనంతరం మాస్టర్ పార్వతీకుమార్ 2022 వరకు ఈ సంప్రదాయాన్ని అత్యంత నిబద్ధతతో కొనసాగించారు. నేడు వారి అడుగుజాడల్లో జగద్గురు పీఠం కార్యనిర్వాహక బృందం ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో జరిగే సామూహిక గాయత్రీ మంత్రగానం, వేదసూక్తాల పఠనం ప్రాచీన కాలంలో రుషులు నిర్వహించిన ‘సత్రయాగాన్ని’ తలపిస్తాయి. పరమగురువుల మార్గాన్ని అనుసరిస్తూ, అంతర్యామి సాధన ద్వారా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందించడమే ఈ గురుపూజోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. సనాతన భారతీయ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ, సాధకులను సన్మార్గంలో నడిపించడంలో ఈ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
–చింతలపాటి సత్యదేవ్, అజ్జరపు శ్రీనివాస్, జగద్గురుపీఠం(ది వరల్డ్ టీచర్ ట్రస్ట్) నిర్వాహకసభ్యుడు
పాశ్చాత్య దేశాల్లో కృష్ణ తత్త్వం
క్రీస్తు బోధనలతో పాటు భగవద్గీతలోని యోగా మార్గాన్ని అనుసరిస్తూ ఆత్మానందాన్ని పొందుతున్నాం. మాస్టర్ ఈకే అందించిన జ్ఞాన సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ఆయన రచించిన మూడు ఆంగ్ల గ్రంథాలను స్పానిష్ భాషలోకి అనువదించడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఇప్పటి వరకు 33 సార్లు భారతదేశాన్ని సందర్శించి హిమాలయాలు, అరవింద ఆశ్రమం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాము. గంగ, గోదావరి నదులలో పవిత్ర స్నానాలు ఆచరించడం మా జీవితాల్లో మరువలేని ఆధ్యాత్మిక అనుభూతి. ముఖ్యంగా స్పెయిన్‌లోని మా నివాసంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని మాస్టర్ పార్వతీకుమార్ స్వయంగా ప్రతిష్టించడం మా పూర్వజన్మ సుకృతం. ప్రస్తుతం మేము కృష్ణోత్తరం, నారాయణ కవచం వంటి స్తోత్రాలను కూడా నేర్చుకుని నిత్యం పఠిస్తున్నాం. భారతీయ ఆధ్యాత్మికత మా జీవనశైలిని ఉన్నతంగా మార్చింది.
–మైఖేల్, రోసా సరస్సేల్, స్పెయిన్
కులమతాలకు అతీతం ఆధ్యాత్మిక జీవనం
భారతీయ రుషులైన మరువు, దేవాపి, వేదవ్యాసుల ఉన్నతమైన బోధనలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. 2019లో కాలిఫోర్నియాలోని మౌంట్ శాస్టాలో మాస్టర్ పార్వతీకుమార్ నిర్వహించిన ‘మాస్టర్ సీవీవీ మే కాల్ డే’ సమావేశాలు మా జీవితాల్లో ఒక గొప్ప మలుపు. అన్ని మతాల సారాంశం ఆధ్యాత్మికతేనని, అది కులమతాలకు అతీతమైన ఒక ఉన్నత జీవన విధానమని ఆయన మాకు స్పష్టం చేశారు. ఆయన బోధనలకు ప్రభావితమై, అప్పటి నుంచి మేము నిరంతరం యోగ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం మాకు నిత్య ప్రశాంతతను అందిస్తోంది.
–లూయిస్, ఇన్మా, అర్జెంటీనా
భారతీయ జీవనశైలితోనే నిత్య ప్రశాంతత
భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక భూభాగం మాత్రమే కాదు, అది సహనం, సమైక్యత, శాంతికి నిలయం. 15 ఏళ్లుగా విశాఖలో జరుగుతున్న ‘ది వరల్డ్ టీచర్ ట్రస్ట్’ గురుపూజోత్సవాల్లో నిరంతరం పాల్గొంటున్నా. ముఖ్యంగా మాస్టర్ ఈకే, మాస్టర్ పార్వతీకుమార్ రచించిన గ్రంథాలు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడమే కాకుండా, నిత్య జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను చూపిస్తున్నాయి. ఈ ఉన్నతమైన బోధనల వల్ల తన జీవనశైలిలో సానుకూలమైన మార్పు వచ్చింది. భారతీయ జీవన విధానం ఆదర్శనీయం. –రియాజ్, బార్సిలోనా
విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం
విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం
విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం
విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం
విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం


