ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు

Oct 7 2023 12:36 AM | Updated on Oct 7 2023 8:37 AM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్‌కోస్ట్‌ గేట్‌ వే ఆఫ్‌ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ తొంభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్‌ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది.

1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్‌ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్‌ నేవిగేషన్‌ కంపెనీ తొలి పాసింజర్‌ షిప్‌ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్‌, గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లార్డ్‌ విల్లింగ్‌ డన్‌ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజినీర్లు డబ్ల్యూసీ యాష్‌, ఓబీ రాటెన్‌బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టులో ప్రధానంగా స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్‌ టెర్మినల్‌ పోర్టులోనే ఉండటం విశేషం.

ఏటా సంస్కరణలు.. సాంకేతికత పరుగులు
గ్రీన్‌ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్‌ మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తోంది. 2023–24 నాటికి 20 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు.

ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి పనులు పూర్తి కానున్నాయి.

► ఏపీ, తెలంగాణా, చత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ , పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ గేట్‌ వే గా వ్యవహరిస్తోంది.

మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్ధాయి ట్రక్‌ పార్కింగ్‌ టెర్మినల్‌ ను 666 వాహనాల పార్కింగ్‌ సామర్థ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్‌ స్టోరేజ్‌ షెడ్‌ నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన మరో కవర్డ్‌ స్టోరేజ్‌ యార్డ్‌ నిర్మాణం పూర్తి కానుంది.

పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్‌ క్యూ–7, 8 బెర్త్‌ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు.

రూ.800 కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌, సీఎన్జీ బంకరింగ్‌ స్టేషన్‌ నెలకొల్పేందుకు హెచ్‌పీసీఎల్‌, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది.

కాలుష్యాన్ని నియంత్రిస్తూ..
పోర్టు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు. విశాఖ ప్రజల సహకారంతోనే నిరంతరాయంగా పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. నగరం అభివృద్ధితో పాటు కాలుష్య నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించాం. 655 ఎకరాలలో 5.7 లక్షల మొక్కల్ని ఇప్పటి వరకూ నాటాం. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు ఛానెల్స్‌, బెర్తులని మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల సైతం నుంచి ఆదాయం ఆర్జించేలా సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాం.
– డా.అంగముత్తు, విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement