అవే చివరి మాటలవుతాయని తెలీదు.. ఒక్కసారిగా కుప్పకూలడంతో | Sakshi
Sakshi News home page

అవే చివరి మాటలవుతాయని తెలీదు.. ఒక్కసారిగా కుప్పకూలడంతో

Published Tue, May 9 2023 12:56 AM

- - Sakshi

మల్కాపురం(విశాఖ పశ్చిమ): అంత వరకు భార్య, పిల్లలతో సరదాగా గడిపాడు. కబుర్లు చెప్పాడు. వేసవి సెలవులు కదా అని బయట ఎండలో తిరగొద్దని, అమ్మ చెప్పినట్టు వినాలని తన ఇద్దరి పిల్లలకు హితబోధ చేశాడు. బైబై చెబుతూ విధులకు వెళ్లిపోయాడు. అప్పటికి ఆయనకు తెలియదు ఇవే తన చివరి మాటలవుతాయని. జీవీఎంసీ 60వ వార్డు పవనపుత్ర కాలనీకి చెందిన పల్లా శ్రీధర్‌(45) హెచ్‌పీ ఎల్‌పీజీ(గ్యాస్‌ కంపెనీ) బోటలింగ్‌ ప్లాంట్‌లో పదిహేనేళ్లుగా సొసైటీ కార్మికుడిగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు వెళ్లారు.

ఓ లారీకి కార్మికులతో కలిసి లోడింగ్‌ కూడా చేశారు. 7 గంటల సమయంలో నడుస్తూ అక్కడ కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ పని చేస్తున్న తోటి కార్మికులు విషయాన్ని అధికారులకు చెప్పారు. విధులకు వెళ్లిన గంట సమయానికి శ్రీధర్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడని ఫోన్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి రోదించారు. వెంటనే ఓ వాహనంలో శ్రీధర్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శ్రీధర్‌ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో మృతదేహాన్ని అదే వాహనంలో ప్లాంట్‌ వద్దకు తీసుకొచ్చి కార్మికులు, మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ వచ్చి మృతుడి భార్య ఆశరాణిని ఓదార్చారు. ఘటనకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, 60వ వార్డు కార్పొరేటర్‌ పి.వి.సురేష్‌, పలు ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధులు బద్రినాథ్‌, భోగవళ్లి నాగభూషణం, నక్క లక్ష్మణరావు, ఎల్‌పీజీ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కార్మికుల గౌరవాధ్యక్షుడు పృధ్వీరాజ్‌, లక్ష్మణమూర్తి, నర్సింగ్‌యాదవ్‌ తదితరులు పరిహారంపై యాజమాన్యంతో చర్చలు జరిపారు.

మృతుడి కుటుంబానికి రూ.14 లక్షల పరిహారం, భార్య ఆశరాణికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉపాధి, ఇతర అలవెన్స్‌లు ఇస్తామని యాజమాన్యం అంగీకరించింది. అలాగే ఆడారి ఆనంద్‌కుమార్‌ తన సొంత నిదుల నుంచి శ్రీధర్‌ కుటుంబానికి రూ.2 లక్షలు అందిస్తానని ప్రకటించి, తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లూధర్‌బాబు తెలిపారు. చర్చలు సానుకూలంగా ముగియడంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement
Advertisement