కొత్తూరు: గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించడానికి ఆయా శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల పరిధిలోని పెంజర్ల పంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. ఖాళీ ప్రాంతాలు, ఇళ్ల మధ్య చెత్త పారబోయొద్దని, ఇళ్ల నుంచే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీకేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రోళ్ల జగన్, ఎంపీడీవో అరుంధతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


