యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వదరకు బ్రిడ్జి రెండు సార్లు కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీనికితోడు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హ్యామ్’(హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్) మొదటి విడతలో తాండూరు నుంచి కోకట్ కొత్త బ్రిడ్జి నిర్మాణం కలుపుకొని ధారూరు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.63 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ అనంతరం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో మండలవాసుల కష్టాలు దూరం కానున్నాయి.
ఎన్‌టీఆర్ హయాంలో..
మండలంలోని కోకట్ గ్రామ శివారు ప్రధాన మార్గంలో కాగ్నా నది దిగువకు ప్రవహిస్తుంది. 1985లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి.. దివంగత ఎన్‌టీ రామారావు హయాంలో కాగ్నాపై కొత్త బ్రిడ్జిని మంజూరు చేశారు. తాండూరు నుంచి రాస్నం, ముద్దాయిపేట, పగిడియాల, బాణాపూర్, నాగసముందర్, కమాల్‌పూర్‌తో పాటు పరిగి, షాద్‌నగర్ ప్రాంతాలకు వెళ్లే వారికి అనువుగా మారింది. కాలక్రమేణ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. దీనికితోడు ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో వాహనదారులు, రైతులు, విద్యార్థులు, ప్రయాణికులు అవస్థల పడేవారు. గతంలో వరద ప్రవాహానికి గురై కాగ్నాపై ఉన్న బ్రిడ్జి రెండు సార్లు కోతకు గురైంది. అప్పట్లో కోతకుగురై ప్రాంతంలో తాత్కలికంగా కిందిభాగంలో పైపులు వేసి నాపరాతి ముక్కలు వేసి రాకపోకలు ప్రారంభించారు. ప్రస్తుతం కోతకు గురైన ప్రాంతంలో నాపరాతి ముక్కలు, మొరంతో చదును చేసిన ప్రాంతం నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరు కావడంతో వర్షాకాంలో ఎదురయ్యే సమస్య ఇక దూరం కానుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీనారాయణపూర్ –
దేవనూరు మార్గంకు మోక్షం
కోకట్ కాగ్నా నదిపై కొత్త బ్రిడ్జితో పాటు లక్ష్మీనారాయణపూర్ నుంచి దేవనూరు వరకు అధ్వానంగా మారిన రోడ్డుకు మోక్షం కలిగింది. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు పనులకు గాను 12 కిలోమీటర్ల నిడివికి రూ.41.31 కోట్లు హ్యామ్ నిధులు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ప్రయాణమంటే జడిసిపోయే వాహనదారులు, ప్రయాణికులు నిధుల మంజూరుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోకట్ కాగ్నా నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ‘హ్యామ్’ నిధులు
లక్ష్మీనారాయణపూర్ – దేవనూరు రోడ్డుకు మోక్షం
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
ఆనందంగా ఉంది
నలభై ఏళ్ల క్రితం నిర్మించిన కోకట్ బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండటం, వర్షాకాలంలో బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. వరద ఉధృతికి రెండుసార్లు బ్రిడ్జి కోతకు గురై పూర్తిగా కూలడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో కోకట్ కాగ్నాపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు కావడం హర్షణీయం.
– రాజేందర్‌రెడ్డి, కోకట్ సర్పంచ్
ఎమ్మెల్యే కృషితో నిధుల మంజూరు
లక్ష్మీనారాయణపూర్ – దేవనూరు ప్రధాన మార్గం మండలవాసులకు ఎంతో ఇబ్బంది కలిగించేది. ఈ మార్గంలో కొత్త రహదారికి భారీగా నిధులు మంజూరు అయ్యాయి. దీంతో పాటు కోకట్ కాగ్నా బ్రిడ్జి స్థానంలో కొత్తగా హైలెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు రాబట్టడంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. హ్యామ్ మొదటి విడతలో భారీ నిధులను తాండూరుకు తెచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
– మహిపాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు


