ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రమేష్
పరిగి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత తొలగించడం సరికాదని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రమేష్ అన్నారు. మంగళవారం పరిగి పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భద్రతను కొనసాగించాలని పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..20 సంత్సరాలుగా ప్రవీణ్‌కుమార్ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలను అందించారని అన్నారు. టెర్రరిస్టులను, నక్సలైట్ల నుంచి ముప్పు ఉన్నందున ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షతోనే భద్రతను తొలగించారని మండి పడ్డారు. ఒక దళిత నాయకుడైనందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెంటనే పూర్తి భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
న్యాయ పోరాటం చేస్తాం
మర్పల్లి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యక్తిగత భద్రతను దొలిగిస్తే న్యాయ పోరాటం చేస్తామని స్పేరోస్ జిల్లా నాయకులు విజయ్ అన్నారు. మంగళవారం ఈ మేరకు వికారాబాద్ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఉగ్రమూకల నుంచి ముప్పు ఉన్నందున భద్రత విషయంతో నిర్లక్ష్యం సరికాదన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో స్పేరోస్ మండల నాయకులు చిన్న, శ్రీకాంత్, ప్రశాంత్, శవికాంత్, ప్రదీఫ్, ఉదయ్ నాగేష్ తదితరులు ఉన్నారు.
భద్రత తగ్గించడం బాధాకరం
దోమ: మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రత తగ్గించడం బాధకరమని ఆ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ బొంపల్లి వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దళితులను రాజకీయంగా ఎదుర్కోలేక సెక్యూరిటీ తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలను పణంగా పెట్టి పోలీస్ శాఖలో సేవలను అందించారని గుర్తు చేశారు.
ప్రశ్నించే గొంతులను అణిచివేసే కుట్ర
తాండూరు టౌన్: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను యథావిధిగా కొనసాగించాలని స్వేరోస్ జిల్లా కార్యదర్శి శివకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదులు, నేరగాళ్లతో ముప్పు ఉందని గత ప్రభుత్వాలు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, వ్యక్తిగత భద్రతను కల్పించిందని, ప్రభుత్వం వాటిని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.


