● ధ్వంసమైన గోడలు, కిటికీలు, తలుపులు, సామగ్రి
● కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం
● భారీ శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి లోపలి భాగం
హుడాకాంప్లెక్స్: వంటగదిలో గ్యాస్ లీకై దేవుడి గదిలోని దీపం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాపునగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి దేవరశెట్టి దేవేందర్ తన కుటుంబంతో కలిసి బాపునగర్ చౌడిసమీపంలోని రోడ్డు నంబర్ 4లో నివసిస్తున్నారు. 1993లో ఇంటిని కొనుగోలు చేసి 2007లో మొదటి అంతస్తు నిర్మించారు. ప్రస్తుతం దేవేందర్ తన కుటుంబంతో ఈ అంతస్తులోనే నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ ధాటికి వంట గది గోడలు ధ్వంసం కావడంతో పాటు కిటికీ ఊడి రోడ్డుపై పడింది. వంట సామగ్రి సహా ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. ఫ్రిడ్జ్ కింద పడిపోయింది. హాలులో ఉన్న షోకేసు అద్దాలు పగిలి ఇంటి నిండా పడ్డాయి. ఘటనా స్థలాన్ని సరూర్‌నగర్ ఏసీపీ కృష్ణయ్య సందర్శించారు. ఈ పేలుడికి గ్యాస్ లీకేజీ కారణమని ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. రెగ్యులేటర్‌కు, స్టౌకు మధ్య ఉండే పైపు నుంచి గ్యాస్ లీకై ందని, వంట గదిలో మూలన ఉన్న పూజా మందిరంలో వెలిగించిన దీపం కారణంగా పేలుడు జరిగిందని అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌ల ద్వారా పరిశీలించారు. పేలుడు జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నా.. ప్రభావం హాలు దాటి పోకపోవడంతో వారికి ఎలాంటి హానీ జరగలేదు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు జరిగినప్పుడు వంటగదిలోనే మరో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అవి పేలి ఉంటే తీవ్రత, నష్టం చాలా ఎక్కువగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.


