మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని కోళ్లపడకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రయాణానికి ఈఐపీఎల్ ఇన్‌ఫ్రా, రోటరీ క్లబ్ సహకారంతో సుమారు రూ.50 లక్షల వ్యయంతో బహూకరించిన రెండు స్కూల్ బస్సులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన, విశాలమైన తరగతి గదులు, క్రీడామైదానాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, బలోపేతం చేసేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. బస్సుల దాతలు శ్రీధర్‌రెడ్డి, పెంచల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం తమవంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో బస్సులను బహూకరించినట్టు చెప్పారు. ఈఐపీఎల్ సహకారాంతో త్వరలో పాఠశాల ప్రహరీ నిర్మాణం చేపడతామని కంపెనీ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఈఐపీఎల్ సంస్థ ప్రతినిధి కళ్యాణ్‌రెడ్డి, సర్పంచ్ చేపంగి ప్రవీణ్, ఉప సర్పంచ్ మల్లేష్, మాజీ సర్పంచ్ హన్మగళ్ల చంద్రయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నందిగామ నర్సింహ, దుబ్బచర్ల మాజీ సర్పంచ్ ఏరువా స్లీవారెడ్డి, ఎంఈఓ కస్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు


