కొడంగల్: నియోజకవర్గంలో వేరుశనగ విత్తనాలు రైతులకు ఇవ్వకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్న వ్యవసాయాధికారులపై కలెక్టర్ దీపక్ తివారి వేటు వేశారు. బొంరాస్‌పేట మండలం మెట్లకుంట క్లస్టర్ ఏఈఓ జగదీశ్వర్‌రెడ్డి, దౌల్తాబాద్ మండలం గోకాపస్లావాద్ ఏఈఓ మమతలనుసర్వీస్ నుంచి తొలగించారు. దుద్యాల్ మండల వ్యవసాయాధికారి నాగరాజును సస్పెండ్ చేశారు. జవాబుదారీ తనాన్ని, చిత్తశుద్ధిని కాపాడే ఉద్దేశంతో తదుపరి చర్యల కోసం కొడంగల్ (ఏడీఏ) వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్‌ను సరెండర్ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.
అసలేం జరిగిందంటే..
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన రైతుల కోసం వేరుశనగ విత్తనాలు సరఫరా చేసింది. వాటిని ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా తూతూమంత్రంగా కొంత మంది రైతులకు ఇచ్చి మిగిలిన విత్తనాలను పెద్ద మొత్తంలో బహిరంగ మార్కెట్‌లో విక్రయించారనే ఆరోపణలు వచ్చా యి. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో విచారణ చేశారు. రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. తమకు విత్తనాలు ఇవ్వలేదని రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.


